
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ, రోజువారీ చమురు ధరల సవరణ విధానంపై సరుకు రవాణా సంఘాలు భగ్గుమంటున్నాయి. దీన్ని ముందునుంచీ వ్యతిరేకిస్తున్న సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీనికి తెలంగాణ లారీ యజమానుల సంఘం మద్దతు పలికింది. సోమ, మంగళవారాల్లో ఒక్క లారీ కూడా రోడ్డెక్కకుండా చూస్తామని ప్రకటించింది.
ఈ రెండు రోజుల్లో సరుకుల తరలింపు ఉండదని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, దుర్గాప్రసాద్‌లు ఓ ప్రకటనలో తెలిపారు. ఆలిండియా మోటార్ ట్రాన్స్ పోర్టు కాంగ్రెస్, ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ల నిర్ణయం మేరకు తాము బంద్‌కు పిలుపిచ్చామని వారు తెలిపారు.