సింగరేణికి సమ్మె దెబ్బ
Published Sat, Apr 1 2017 6:22 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
రోజుకు 6 వేల టన్నుల రవాణాకు బ్రేక్
శ్రీరాంపూర్: తమ డిమాండ్ల సాధన కోసం దక్షిణాది రాష్ట్రాల్లోని లారీ యజమానులు ఏప్రిల్ 1నుంచి నిరవధిక సమ్మెకు దిగడంతో సింగరేణి బొగ్గు రవాణాకు బ్రేక్ పడింది. ఒక రోజు ముందే మార్చి 31 నుంచే లారీలను నిలిపివేశారు. సింగరేణిలో మార్చి 31 నాటికి వార్షిక ఉత్పత్తి లక్ష్యాల సాధన కోసం అన్ని ఏరియాల్లో ఇబ్బడిముబ్బడిగా బొగ్గు ఉత్పత్తి చేశారు.
లారీల సమ్మెతో ఒక్క బొగ్గు పెళ్ల కూడా కదలని పరిస్థితి ఏర్పడడంతో రీజియన్ పరిధిలో గనులపై, సీహెచ్‌పీలు, కోల్ యార్డుల వద్ద రోజుకు ఆరువేల టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఉత్పత్తి అయిన బొగ్గులో 65 శాతం వ్యాగన్ల ద్వారా ఎన్టీపీసీ, భారీ సిమెంట్ కంపెనీలు, ఇతర బొగ్గు ఆధారిత సంస్థలకు సరఫరా అవుతుంటుంది.
మిగిలిన 35 శాతం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమళనాడు వంటి ప్రాంతాల్లోని సిమెంట్, చిన్న విద్యుత్ సంస్థలు, ఐరన్ పరిశ్రమలకు రోడ్డు మార్గాన లారీల ద్వారా వెళ్తుంది. సమ్మెతో లారీలపై ఆధారపడిన సుమారు 1200 మంది లారీ యజమానులు, సుమారు మూడు వేల మంది డ్రైవర్లు, క్లీనర్లు, లోడింగ్, అన్‌లోడింగ్ కార్మికులు, ట్రాన్స్‌పోర్టు నిర్వాహకులు, సిబ్బంది అందరూ సమ్మె వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదిలా ఉండగా భూగర‍్భంలోంచి బొగ్గు బయటకు వచ్చిన తరువాత గాలిలో ఉన్న ఆక్సిజన్‌తో కలిసి సహజసిద్ధంగా రసాయన చర్యనొంది దానంతటదే మండుతోంది. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం కారణంగా ఈ విధంగా జరుగుతుంది. రవాణా సమ్మె ఇలాగే కొనసాగితే బొగ్గు నిల్వలు మంటలకు ఆహుతయ్యే ప్రమాదం ఉంది. బొగ్గు కాలిపోతే గ్రేడ్ పడిపోయి సంస్థకు నష్టం వచ్చే ప్రమాదం ఏర్పడింది.
Advertisement
Advertisement