లారీలు రోడ్డెక్కాయ్
లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో సర్కారు చర్చలు సఫలం
సాక్షి, హైదరాబాద్: ఒకరోజు సమ్మె అనంతరం లారీలు రోడ్డెక్కాయి. లారీ యజమానుల సంఘం డిమాండ్లను పరిశీలించేందుకు రాష్ట్రప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించటంతో లారీల సమ్మెకు తెరపడింది. మంగళవారం అర్ధరాత్రి మొదలైన సమ్మె వల్ల ఎరువులు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల రవాణాకు ఇబ్బంది ఎదురుకావటంతో విషయాన్ని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో ఆయా శాఖల మంత్రులు సమస్య తీవ్రతను సీఎం కేసీఆర్‌కు వివరించారు.
లారీ యజమానుల సంఘంతో చర్చించి సమ్మె విరమించేలా చూడాలని ఆయన ఆదేశించటంతో గురువారం ఉదయం మంత్రులు మహేందర్‌రెడ్డి, హరీశ్‌రావు లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో సచివాలయంలో చర్చించారు. 11 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచినా వారు.. త్రైమాసిక పన్నును జనాభా నిష్పత్తిలో తగ్గించాలని, ఏపీ తెలంగాణ మధ్య లారీలు తిరిగేలా వార్షిక కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేయాలనే డిమాండ్లపై పట్టుబట్టారు.
వీటిపై సీఎం స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సినందున మంత్రులు స్పష్టత ఇవ్వలేదు. వాటికి అంగీకరిస్తేనే సమ్మె విరమిస్తామని పట్టుబట్టడంతో పర్మిట్‌లకు సమ్మతిస్తున్నట్టు మంత్రులు పేర్కొన్నారు. త్రైమాసిక పన్ను తగ్గింపు సహా మిగతా డిమాండ్లపై స్పష్టత ఇచ్చేందుకు గడువు కావాలని, దీనిపై రవాణా రంగంతో ముడిపడిన విభాగాల ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రులు ప్రతిపాదించారు. కమిటీ 3 వారాల్లో నివేదిక సమర్పిస్తుందని, దాని సిఫార్సుల ఆధారంగా డిమాండ్లపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీనికి సమ్మతించిన లారీ యజమానుల సంఘం.. సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించింది.
గుజరాత్ విధానాల అధ్యయనం..
గుజరాత్‌లో రవాణా రంగ విధానాలు ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో వాటిని అధ్యయనం చేసేందుకు అధికారులు, లారీ యజమానుల సంఘం ప్రతినిధుల బృందాన్ని పంపాలని నిర్ణయించినట్టు సమావేశానంతరం మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అక్కడి విధానాలను పరిశీలించి ఉన్నతమైనవాటిని ఇక్కడ అమలు చేస్తామన్నారు. రవాణా, వాణిజ్య పన్నులు, పోలీసు శాఖలు వేధిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ మూడు విభాగాల ఉన్నతాధికారులు, లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో ఉన్నతస్థాయి భేటీని ఏర్పాటు చేసి చర్చించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని హైవేలపై లారీల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తామని, 38 రెవెన్యూ డివిజనల్ కేంద్రాల్లో డ్రైవర్ల శిక్షణకు కేంద్రాలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
రూ.5 వేలు చెల్లిస్తే రెండు రాష్ట్రాల పర్మిట్..
రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్యా కొత్తగా త్రైమాసిక పన్ను విధింపు అమలులోకి వచ్చింది. తాజా చర్చల్లో కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లకు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ అంగీకరిస్తే.. వార్షికంగా రూ.5 వేలు చెల్లించి కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ పొందే వెసులుబాటు కలుగుతుంది. ఆ పర్మిట్లకు ఏపీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటకలతో ఉన్న ఒప్పందం తరహాలోనే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కోసం ఏపీకి లేఖ రాయనున్నట్టు మంత్రి చెప్పారు. చర్చల్లో లారీ యజమానుల సంఘం గౌరవాధ్యక్షుడి హోదాలో ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ పాల్గొన్నారు.