పప్పులు.. బియ్యం బంద్!
♦ లారీల సమ్మెతో హైదరాబాద్‌కు నిలిచిపోయిన నిత్యావసరాల సరఫరా
♦ వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న అసోసియేషన్ల నాయకులు
♦ డీసీఎం అద్దం పగలగొట్టడంతో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: లారీల సమ్మె తీవ్రమైంది. లారీ యజమానుల ఆందోళన ఆదివారంతో నాలుగో రోజుకు చేరుకుంది. ఎక్కడి చక్రం అక్కడే ఆగింది. హైదరాబాద్‌కు బియ్యం, పప్పులు, అల్లం, వెల్లుల్లి వంటి నిత్యావసరాలు, సిమెంట్, స్టీలు వంటి ముడిసరుకుల రవాణా పూర్తిగా స్తంభించింది. రాష్ట్ర రాజధాని శివార్లలోని ఆటోనగర్ వద్ద తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు వేర్వేరుగా శిబిరాలు ఏర్పాటు చేసుకుని బంద్‌ను పర్యవేక్షించారు.
ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్న లారీలను అసోసియేషన్ల నాయకులు, లారీ యజమానులు అడ్డుకుని నిలిపివేస్తున్నారు. ఆదివారం కంకరతో వస్తున్న టిప్పర్లను, ఇతర సరుకుతో వస్తున్న లారీలను అడ్డుకుని టైర్ల నుంచి గాలి తీసివేశారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని, తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లారీ ఓనర్స్, దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.
నగరానికి రాకపోకలు సాగించే సుమారు 5 వేల లారీలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. సుమారు 500 లారీల బియ్యం, 200 లారీల ఉల్లి, అల్లం వెల్లుల్లి తదితర సరుకుల రవాణా నిలిచిపోయింది. అత్యవసర వస్తువులైన పాలు, పండ్లు, కూరగాయలు, మందులు, పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ వంటి అత్యవసరాల రవాణా మాత్రం ఎప్పట్లాగే కొనసాగుతుండడం కాస్త ఊరటనిస్తోంది. మరోవైపు లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు రవాణా శాఖ సన్నద్ధమైంది.
నేడు బీమా సంస్థతో చర్చలు!
లారీ యాజమాన్య సంఘాలతో సోమవారం బీమా నియంత్రణ సంస్థ చర్చలు జరిపే అవకా శాలున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. చర్చల ఫలితాన్ని బట్టి తమ భవిష్యత్ ఆందోళన ఉంటుందన్నారు. తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించని పక్షంలో అత్యవసర వస్తువులను రవాణా చేసే లారీలను సైతం నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు.
‘మలక్‌పేట్’కు రాని మిర్చి, ఉల్లి
మలక్‌పేట్‌లోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు సాధారణ రోజుల్లో నిత్యం 10 వేల బస్తాల మేర మిర్చి, ఉల్లిగడ్డ సరఫరా జరిగేది. కానీ ప్రస్తుతం సమ్మె కారణంగా రోజుకు 400 బస్తాలకు మించి రావడం లేదని వ్యాపారులు వాపోయారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, గుంటూరు, ఖమ్మం జిల్లాల నుంచి సరుకు రవాణా నిలిచిపోయిందని పేర్కొన్నారు. వారం క్రితం పెద్ద మొత్తంలో సరుకు నిల్వచేయడంతో ప్రస్తుత అవసరాలకు సరిపోతోందని, మరిన్ని రోజులు ఆందోళన కొనసాగితే సరుకులు నిండుకుంటాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బేగంబజార్‌కు అరకొర సరఫరా
నగరంలోని ప్రధాన మార్కెట్‌గా ఉన్న బేగం బజార్, మహారాజ్‌గంజ్, ముక్తార్‌గంజ్, సిద్ధి అంబర్ బజార్లకు కొబ్బరి, పప్పులు, బియ్యం, అల్లం, వెల్లుల్లి, డ్రైఫ్రూట్స్ రవాణా స్తంభించిం ది. గతంలో ఈ ప్రాంతాలకు నిత్యం 200–300 టన్నుల సరుకు రవాణా అయ్యేది. ప్రస్తుతం 40 టన్నులే సరఫరా అందుతోందని వ్యాపారులు తెలిపారు. తమిళనాడు, కేరళ నుంచి నిత్యం 20 లారీల కొబ్బరి వచ్చేదని, ప్రస్తుతం ఒక్క లారీ కూడా రావడం లేద న్నారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నగరానికి వచ్చే ఉల్లి, ఆలు, టమాటా రవాణా తగ్గిందని చెప్పారు. పండ్లు, కూరగాయలు, పాలు, మందులు, డీజిలు, పెట్రోలు వంటి అత్యవస రాలను సమ్మె నుంచి మినహాయించడంతో వాటి సరఫరా యథాతథంగా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు.