పుంగనూరు: జర్మనీకి చెందిన తమకు రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సహకారం మరువలేనిదని పెప్పర్ మోషన్ విద్యుత్ బస్సుల తయారీ సంస్థ సీఈవో ఆండ్రియాస్ హేగర్ చెప్పారు. తాము చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏర్పాటు చేయబోయే పరిశ్రమ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. హేగర్, ఆయన బృందం శుక్రవారం పుంగనూరు మండలంలోని ఆరడిగుంటలో పెప్పర్ మోషన్ బస్సులు, ట్రక్కుల తయారీ పరిశ్రమకు కేటాయించిన భూమిని జిల్లా కలెక్టర్ షన్మోహన్‌తో కలిసి పరిశీలించింది.
ఈ సందర్భంగా హేగర్ జిల్లా కలెక్టర్‌తో, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్‌తో పలు విషయాలపై చర్చించారు. అనంతరం పుంగనూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారతదేశం పెప్పర్ మోషన్ సంస్థకు రెండో పుట్టినిల్లు అని తెలిపారు. 2009లో తొలిసారిగా ఇండియాను సందర్శించామన్నారు. భారతదేశంలో అధిక జనాభా ఉన్నారని, అధిక శాతం వాహనాలను వినియోగిస్తున్నారని తెలిపారు. అందుకే ఇక్కడ 800 ఎకరాలలో రూ.4,640 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో 8,100 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు.
ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 2027 నాటికి 30 వేల బస్సులు, ట్రక్కులను మార్కెట్‌లో విడుదల చేస్తామన్నారు. మూడు దశల్లో నిర్మాణం చేస్తామని తెలిపారు. పర్యావరణానికి పూర్తి అనుకూలమైన విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీతో పాటు విడిభాగాల తయారీ పరిశ్రమ కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నారు.
బెంగళూరు, తమిళనాడుకు పుంగనూరు జాతీయ రహదారులు అనుసంధానం కావడం, విమానాశ్రయాలు, రవాణా సదుపాయాలు ఎంతో బాగుండడంతో ఇక్కడ పరిశ్రమ పెట్టాలని నిర్ణయించామన్నారు. దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలు కొనసాగించేందుకు వీలుందని సీఈవో తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ షన్మోహన్ పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు.
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది: జిల్లా కలెక్టర్
పుంగనూరు మండలంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జర్మన్ పెప్పర్ ఎల్‌క్ట్రికల్ బస్సుల సంస్థ పరిశ్రమ ఏర్పాటు కావడం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని జిల్లా కలెక్టర్ షన్మోహన్ కొనియాడారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి చొరవతో పరిశ్రమ ఏర్పాటవుతోందన్నారు. నిరుద్యోగులు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా ఇక్కడే 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని కలెక్టర్ తెలిపారు.
ఘన స్వాగతం
పెప్పర్ కంపెనీ సీఈవో ఆండ్రియస్ హేగర్‌కు, ఆయన బృందానికి కర్ణాటక సరిహద్దులో పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి ఘన స్వాగతం పలికారు. శాలువలు కప్పి సన్మానించారు. హేగర్‌తోపాటు ఆ సంస్థ సీటీవో డాక్టర్ మదియాస్ కెర్లర్, సీఎస్‌వో సత్య, ఫైనాన్స్ డైరెక్టర్ ఉవే స్టెల్డర్, సీఐవో రాజశేఖర్‌రెడ్డి, సీఎస్‌వో సత్య బులుసు, సీసీవో రవిశంకర్, ఉర్త్ ఎల్రక్టానిక్స్ ఎండీ హర్ష ఆద్య తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment