Third Party Insurance Premium
-
థర్డ్ పార్టీ మోటార్ బీమా ప్రీమియం పైపైకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాల థర్డ్ పార్టీ మోటార్ బీమా ప్రీమియం పెరగనుంది. జూన్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సవరించిన ధరల ప్రకారం.. 1,000 సీసీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ప్రైవేట్ కార్లకు ప్రీమియం రూ.2,094గా నిర్ణయించారు. 2019–20లో ఇది రూ.2,072 వసూలు చేశారు. 1,500 సీసీ వరకు రూ.3,416 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.3,221 వసూలు చేశారు. 1,500 సీసీ కంటే అధిక సామర్థ్యం ఉన్న కార్లకు ప్రీమియం రూ.7,897 నుంచి రూ.7,890కు వచ్చి చేరింది. 150–350 సీసీ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలకు రూ.1,366, అలాగే 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉంటే రూ.2,804 ఉంది. ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్లకు 30 కిలోవాట్ అవర్ లోపు రూ.1,780, అలాగే 30–65 కిలోవాట్ అవర్ సామర్థ్యం ఉంటే రూ.2,904 చెల్లించాలి. ప్రీమియంలో 15 శాతం డిస్కౌంట్ ఉంటుంది. 12–30 వేల కిలోలు మోయగల సామర్థ్యం ఉన్న సరుకు రవాణా వాణిజ్య వాహనాలకు ప్రీమియం రూ.33,414 నుంచి రూ.35,313కి చేరింది. 40 వేలకుపైగా కిలోల సామర్థ్యం గల వాహనాలకు రూ.41,561 నుంచి రూ.44,242కు సవరించారు. సాధారణంగా థర్డ్ పార్టీ రేట్లను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ప్రకటించేది. ఐఆర్‌డీఏఐతో సంప్రదింపుల అనంతరం తొలిసారిగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ ధరలను నోటిఫై చేసింది. -
వాహనదారులకు షాకింగ్ న్యూస్..! పెరగనున్న ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు..!
న్యూఢిల్లీ: వాహనాలకు థర్డ్–పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించింది. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. 1,000 సీసీ సామర్థ్యం గల ప్రైవేట్ కార్ల ప్రీమియం రూ.2,074 నుంచి రూ.2,094కు పెరగనుంది. 1,000–1,500 సీసీ సామర్థ్యం గల ప్రైవేట్ కార్లకు రూ.3,221 నుంచి రూ.3,416కు, 1,500 సీసీ కంటే అధిక సామర్థ్యం ఉంటే ప్రీమియం రూ.7,890 నుంచి రూ.7,897కు చేరనుంది. 150–350 సీసీ ద్విచక్ర వాహనాలు రూ.1,366, 350 సీసీపైన ఉంటే రూ.2,804 చెల్లించాల్సి ఉంటుంది. గూడ్స్ వాహనాలు 12–20 వేల కిలోల సామర్థ్యముంటే రూ.33,414 నుంచి రూ.35,313కు, 40 వేల కిలోల పైన సామర్థ్యముంటే రూ.41,561 నుంచి రూ.44,242కు చేరనుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు 15 శాతం, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు 7.5 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. థర్డ్ పార్టీ (టీపీ) మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ గతంలో నోటిఫై చేసేది. ఐఆర్‌డీఏఐతో సంప్రదింపుల అనంతరం రోడ్డు రవాణా శాఖ టీపీ రేట్లను ప్రకటించడం ఇదే తొలిసారి. -
సెప్టెంబర్ 1 నుంచి కొత్త వాహనాలు కొంటే..
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలకు మేరకు సెప్టెంబరు 1 న లేదా తర్వాత విక్రయించిన వాహనాలపై దీర్ఘకాలిక థర్డ్ పార్టీ భీమా వర్తించనుంది. ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్, బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) అన్నిబీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా బీమా సంస్థలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఇప్పుడు కార్ల కోసం మూడు సంవత్సరాల బీమా, ద్విచక్ర వాహనాలకు ఐదు సంవత్సరాల బీమాను ఆఫర్ చేయాలి. అలాగే కొత్త కారు, లేదా బైక్ కొనుగోలు చేసే వినియోగదారులు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. భవిష్యత్ వాహన కొనుగోలుదారులు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ కింద కొత్త కార్ల కోసం రూ. 24వేల దాకా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త మోటార్ సైకిల్స్ కొనుగోలు చేసినవారు 13వేల రూపాయల దాకా చెల్లించాల్సి ఉంటుంది. వాహన్ మోడల్, ఇంజీన్ కెపాసిటీ ఆధారంగా బీమాను నిర్ణయిస్తారు. జూలై 20,2018న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో థర్డ్ పార్టీ వారికి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలని బీమా సంస్థలను కోరింది. ఇంతకుముందు ఇది ఒక్క సంవత్సరం మాత్రమే థర్డ్ పార్టీకి బీమా కల్పించేది. ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ విధానం ప్రకారం కొత్త రేట్లు సెప్టెంబర్ 1, 2018 నుంచి మార్చి 31,2019 వరకు కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి అమలు అవుతుందని ఐఆర్డీఏఐ ప్రకటించింది. దీని ప్రకారం వాహనాలు కొనుగోలు చేసే సమయంలోనే మొత్తం మూడేళ్లకుగానీ ఐదేళ్లకుగానీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వాహనం మరొకరికి అమ్మితేనే వాహన యజమానిపై ఉన్న థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రద్దు చేసి...కొత్త యజమానికి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లవివరాలు ఇలా ఉన్నాయి. ప్రైవేట్ కార్లకు: మూడేళ్ల ప్రీమియం 1000సీసీ మించకుండా ఉండే వాహనానికి రూ.5,286/- 1000సీసీ నుంచి 1500సీసీ మధ్య ఉండే వాహనానికి : రూ.9,534 1500 సీసీకి మించితే : రూ. 24,305 టూ వీలర్స్ : ఐదేళ్ల ప్రీమియం 75 సీసీ లోపు : రూ.1,045 75సీసీ నుంచి 150 సీసీ మధ్య : రూ. 3,285 150 సీసీ నుంచి 350 సీసీ మధ్య: రూ. 5453 350 సీసీకి మించి : రూ.13,034 -
ఆటోలు ఆగాయి..
- నేడు గ్రేటర్లో నిలిచిపోనున్న 1.4 లక్షల ఆటోలు - థర్డ్‌పార్టీ బీమా పెంపునకు వ్యతిరేకంగా ఆటోసంఘాల నిరసన సాక్షి, హైదరాబాద్: భారీగా పెంచిన థర్డ్‌పార్టీ బీమా ప్రీమియంకు వ్యతిరేకంగా ఆటో సంఘాలు శనివారం ఆటో బంద్ తలపెట్టాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 1.4 లక్షల ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. దాదాపు 15 లక్షల మంది ప్రయాణికులపై ఈ ప్రభావం పడనుంది. థర్డ్ పార్టీ బీమా ప్రీమియం పెంపును ఉపసంహరించాలని, ఓలా, ఉబర్ వంటి క్యాబ్‌లను రద్దు చేయాలని కోరుతూ ఆటో సంఘాలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, సీఐటీయూ, తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం తదితర కార్మిక సంఘాలతో కూడిన ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ కార్యదర్శి బి.వెంకటేశం తెలిపారు. లక్షలాది మంది నిరుపేద ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఫైనాన్షియర్ల దోపిడీ, పెరిగిన నిత్యావసరాల ధరలతో దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, దీనికితోడు బీమా ప్రీమియం పెంపు మరింత భారం వారిపై మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బంద్ సందర్భంగా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ అదనపు బస్సులు... ఆటోల బంద్ నేపథ్యంలో నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి అదనపు బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ పురుషోత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి 500 బస్సులు అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
పప్పులు.. బియ్యం బంద్!
♦ లారీల సమ్మెతో హైదరాబాద్‌కు నిలిచిపోయిన నిత్యావసరాల సరఫరా ♦ వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న అసోసియేషన్ల నాయకులు ♦ డీసీఎం అద్దం పగలగొట్టడంతో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం సాక్షి, హైదరాబాద్: లారీల సమ్మె తీవ్రమైంది. లారీ యజమానుల ఆందోళన ఆదివారంతో నాలుగో రోజుకు చేరుకుంది. ఎక్కడి చక్రం అక్కడే ఆగింది. హైదరాబాద్‌కు బియ్యం, పప్పులు, అల్లం, వెల్లుల్లి వంటి నిత్యావసరాలు, సిమెంట్, స్టీలు వంటి ముడిసరుకుల రవాణా పూర్తిగా స్తంభించింది. రాష్ట్ర రాజధాని శివార్లలోని ఆటోనగర్ వద్ద తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు వేర్వేరుగా శిబిరాలు ఏర్పాటు చేసుకుని బంద్‌ను పర్యవేక్షించారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్న లారీలను అసోసియేషన్ల నాయకులు, లారీ యజమానులు అడ్డుకుని నిలిపివేస్తున్నారు. ఆదివారం కంకరతో వస్తున్న టిప్పర్లను, ఇతర సరుకుతో వస్తున్న లారీలను అడ్డుకుని టైర్ల నుంచి గాలి తీసివేశారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని, తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లారీ ఓనర్స్, దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. నగరానికి రాకపోకలు సాగించే సుమారు 5 వేల లారీలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. సుమారు 500 లారీల బియ్యం, 200 లారీల ఉల్లి, అల్లం వెల్లుల్లి తదితర సరుకుల రవాణా నిలిచిపోయింది. అత్యవసర వస్తువులైన పాలు, పండ్లు, కూరగాయలు, మందులు, పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ వంటి అత్యవసరాల రవాణా మాత్రం ఎప్పట్లాగే కొనసాగుతుండడం కాస్త ఊరటనిస్తోంది. మరోవైపు లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు రవాణా శాఖ సన్నద్ధమైంది. నేడు బీమా సంస్థతో చర్చలు! లారీ యాజమాన్య సంఘాలతో సోమవారం బీమా నియంత్రణ సంస్థ చర్చలు జరిపే అవకా శాలున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. చర్చల ఫలితాన్ని బట్టి తమ భవిష్యత్ ఆందోళన ఉంటుందన్నారు. తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించని పక్షంలో అత్యవసర వస్తువులను రవాణా చేసే లారీలను సైతం నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు. ‘మలక్‌పేట్’కు రాని మిర్చి, ఉల్లి మలక్‌పేట్‌లోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు సాధారణ రోజుల్లో నిత్యం 10 వేల బస్తాల మేర మిర్చి, ఉల్లిగడ్డ సరఫరా జరిగేది. కానీ ప్రస్తుతం సమ్మె కారణంగా రోజుకు 400 బస్తాలకు మించి రావడం లేదని వ్యాపారులు వాపోయారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, గుంటూరు, ఖమ్మం జిల్లాల నుంచి సరుకు రవాణా నిలిచిపోయిందని పేర్కొన్నారు. వారం క్రితం పెద్ద మొత్తంలో సరుకు నిల్వచేయడంతో ప్రస్తుత అవసరాలకు సరిపోతోందని, మరిన్ని రోజులు ఆందోళన కొనసాగితే సరుకులు నిండుకుంటాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బేగంబజార్‌కు అరకొర సరఫరా నగరంలోని ప్రధాన మార్కెట్‌గా ఉన్న బేగం బజార్, మహారాజ్‌గంజ్, ముక్తార్‌గంజ్, సిద్ధి అంబర్ బజార్లకు కొబ్బరి, పప్పులు, బియ్యం, అల్లం, వెల్లుల్లి, డ్రైఫ్రూట్స్ రవాణా స్తంభించిం ది. గతంలో ఈ ప్రాంతాలకు నిత్యం 200–300 టన్నుల సరుకు రవాణా అయ్యేది. ప్రస్తుతం 40 టన్నులే సరఫరా అందుతోందని వ్యాపారులు తెలిపారు. తమిళనాడు, కేరళ నుంచి నిత్యం 20 లారీల కొబ్బరి వచ్చేదని, ప్రస్తుతం ఒక్క లారీ కూడా రావడం లేద న్నారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నగరానికి వచ్చే ఉల్లి, ఆలు, టమాటా రవాణా తగ్గిందని చెప్పారు. పండ్లు, కూరగాయలు, పాలు, మందులు, డీజిలు, పెట్రోలు వంటి అత్యవస రాలను సమ్మె నుంచి మినహాయించడంతో వాటి సరఫరా యథాతథంగా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు.