ఆటోలు ఆగాయి..
- నేడు గ్రేటర్‌లో నిలిచిపోనున్న 1.4 లక్షల ఆటోలు
- థర్డ్‌పార్టీ బీమా పెంపునకు వ్యతిరేకంగా ఆటోసంఘాల నిరసన
సాక్షి, హైదరాబాద్: భారీగా పెంచిన థర్డ్‌పార్టీ బీమా ప్రీమియంకు వ్యతిరేకంగా ఆటో సంఘాలు శనివారం ఆటో బంద్ తలపెట్టాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 1.4 లక్షల ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. దాదాపు 15 లక్షల మంది ప్రయాణికులపై ఈ ప్రభావం పడనుంది. థర్డ్ పార్టీ బీమా ప్రీమియం పెంపును ఉపసంహరించాలని, ఓలా, ఉబర్ వంటి క్యాబ్‌లను రద్దు చేయాలని కోరుతూ ఆటో సంఘాలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి.
ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, సీఐటీయూ, తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం తదితర కార్మిక సంఘాలతో కూడిన ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ కార్యదర్శి బి.వెంకటేశం తెలిపారు. లక్షలాది మంది నిరుపేద ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఫైనాన్షియర్ల దోపిడీ, పెరిగిన నిత్యావసరాల ధరలతో దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, దీనికితోడు బీమా ప్రీమియం పెంపు మరింత భారం వారిపై మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బంద్ సందర్భంగా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆర్టీసీ అదనపు బస్సులు...
ఆటోల బంద్ నేపథ్యంలో నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి అదనపు బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ పురుషోత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి 500 బస్సులు అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.