అఫ్జల్‌గంజ్,న్యూస్‌లైన్: గుర్తించిన రేడియల్ రోడ్ల పరిసర ప్రాంతాల్లో బస్‌టెర్మినళ్ల ఏర్పాటుకు ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హెచ్‌ఎండీఏ గుర్తించిన 33 రేడియల్ రోడ్లలో 22 రేడియల్ రోడ్లను ఆర్టీసీ అధికారులు బస్‌టెర్మినల్ నిర్మాణాలకు అనువైన ప్రాంతాలుగా గుర్తించినట్లు ఈడీ కోటేశ్వరరావు తెలిపారు. నేషనల్ హైవే, ఔటర్ రింగ్‌రోడ్డు కలిసే కూడళ్ల పరిసర ప్రాంతాల్లో స్థలం అవసరముందన్నారు. ప్రభుత్వం మూడు లేదా నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే ఆయా ప్రాంతాల్లో నూతన బస్‌టెర్మినళ్ల ఏర్పాటుకు వీలవుతుందన్నారు.
ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఘట్‌కేసర్, శామీర్‌పేట్, శంషాబాద్, కీసర, మొయినాబాద్, రామచంద్రాపురం, గండిమైసమ్మ, మేడ్చల్ పరిసరాలు బస్‌టెర్మినల్ నిర్మాణానికి అనువైన ప్రాంతాలుగా గుర్తించినట్లు వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పర్యావరణాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో ఆర్టీసీ మూడేళ్ల క్రితం 130 సీఎన్‌జీ గ్యాస్ బస్సుల్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ బస్సులు మేడ్చల్, హకీంపేట్, కంటోన్మెంట్ డిపోల పరిధిలో నడుస్తున్నాయన్నారు.
ప్రతి రోజు ఒక్కో బస్సుకు 80 కేజీల చొప్పున సీఎన్‌జీ గ్యాస్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. డీజిల్ బస్సులు లీటరుకు నాలుగున్నర కిలో మీటర్లు, సీఎన్‌జీ గ్యాస్ బస్సులు కేజీకి మూడున్నర కిలో మీటర్ల చొప్పున మైలేజీ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ రెండు బస్సులకు పెద్దగా వ్యతాసం లేదని పేర్కొన్నారు. సీఎన్‌జీ గ్యాస్ కంపెనీలు ప్రస్తుతం సరఫరా చేస్తున్న గ్యాస్ కంటే అదనంగా సరఫరా చేసేందుకు సుముఖంగా లేకపోవడంతో అదనపు సీఎన్‌జీ బస్సుల్ని నడపలేకపోతున్నామని చెప్పారు. గతంలో మరిన్ని సీఎన్‌జీ గ్యాస్ బస్సులను కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిపారు.
రేడియల్ రోడ్లపై బస్సు టెర్మినళ్లు
Published Wed, Dec 25 2013 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement