Bus Terminal
-
యాదాద్రిలో ఆధ్యాత్మిక బస్ టెర్మినల్
యాదాద్రి, భువనగిరి : దేశ, విదేశాల నుంచి దర్శనానికి వచ్చే లక్షలాదిమంది భక్తుల రద్ధీకి అనుగుణంగా ఆలయ సమీపంలో 7 ఎకరాల్లో ఆధ్యాత్మిక బస్ టెర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం యాదాద్రి ఆలయంలో నిర్మించే బస్ టెర్మినల్, బస్ డిపోకు కావల్సిన స్థలాన్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మతో పాటు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. సైదాపురం గ్రామ శివారులో 150 బస్సులు పార్కింగ్ చేసేలా డిపో నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆమోదంతో బస్ స్టేషన్, డిపో నిర్మాణాలను చేపడతామన్నారు. ఆలయ ప్రారంభానికి ముందే బస్ టెర్మినల్, డిపోలను ప్రారంభించడానికి అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.ఆలయానికి వెళ్లేందుకు ప్రత్యేకమైన స్టేషన్, ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు మరో స్టేషన్ నిర్మాణం నూతన బస్ టెర్మినల్ లో నిర్మించేలా ఇంజినీర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారుఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ సుశీల్ శర్మ, కలెక్టర్ అనితా రామచంద్రన్, రవాణా శాఖ కమిషనర్ శ్రీ ఎం.ఆర్.ఎం. రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శ్రీ పురుషోత్తం, శ్రీ పి.వి.మునిశేఖర్, నల్గొండ ఆర్.ఎం శ్రీ వెంకన్న, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఈ ఓ గీత, ఆర్ అండ్ బీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
కొత్తపేటలో బస్ టవర్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు హబ్‌లపై దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని 21.78 ఎకరాల్లో ఉన్న కొత్తపేట పండ్ల మార్కెట్.. ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ (ఐఎస్బీటీ) నిర్మాణానికి అనువైనదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.150 కోట్ల వ్యయంతో 11 అంతస్తులతో మూడు టవర్లు నిర్మించడం ద్వారా ప్రయాణికులకు సకల సౌకర్యాలను ఒకేచోట అందుబాటులోకి తేవచ్చని తేల్చింది. ఇక్కడున్న పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలిస్తారు. ఈట్, ఫన్, షాప్.. ప్రస్తుతం మార్కెటింగ్ విభాగం ఆధ్వర్యంలో ఉన్న పండ్ల మార్కెట్ స్థలంలో బస్సు ట్రాన్సిట్, పార్కింగ్, కమర్షియల్, రిటైల్ డెవలప్మెంట్, పోడియ మ్, హోటల్లు, మల్టీప్లెక్స్‌లను టవర్ స్ట్రక్చర్‌లో ఏర్పాటు చేస్తారు. బస్సుల రాకపోకలు, టెర్మినల్స్, ప్యాసింజర్ సౌకర్యాలు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్.. ఇలా అన్నీ ఒకేచోట ఉంటాయి. ఐఎస్బీటీ ఏర్పాటులో 3 టవర్లను నిర్మిస్తారు. ►1,29,275.96 చదరపు మీటర్ల ప్రాంతంలో 11 అంతస్తులతో కూడిన మొదటి టవర్‌లో బస్సుల హాల్టింగ్, పార్కింగ్ సౌకర్యాలు ►81,688.53 చ. మీ.లో రెండో టవర్‌లో షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్‌లు ►77,652.3 చ.మీలో మూడో టవర్‌లో హోటల్ అండ్ రెస్టారెంట్లు ఐఎస్బీటీ ఎందుకంటే.. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నగరానికి వందలాది ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. సిటీ బస్సులూ వేలల్లో తిరుగుతున్నాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. ఇక్కడ ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తూ, ప్రత్యామ్నాయంగా సౌకర్యాలు కల్పిస్తూ ఐఎస్బీటీ నిర్మాణానికి హెచ్ఎండీఏ అధికారులు ప్రణాళిక రచించారు. విజయవాడ హైవేకు దగ్గరగా ఉండటంతో పాటు ఏ ప్రాంతం నుంచైనా బస్సులు సులువుగా వచ్చి వెళ్లే వీలుండటంతో కొత్తపేట పండ్ల మార్కెట్‌ను ఎంపిక చేశారు. ఇక్కడికి వచ్చే ప్రయాణికులు.. నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా మెట్రో రైలూ అందుబాటులో ఉంటుంది. దిల్సుఖ్నగర్ బస్ డిపోలో ఐసీబీటీ ప్రతిపాదిత ఐఎస్బీటీకి కూతవేటు దూరంలో దిల్సుఖ్నగర్ బస్ డిపో విస్తరించి ఉన్న 7.83 ఎకరాల ప్రాంతం ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ (ఐసీబీటీ) నిర్మాణానికి అనువైనదని హెచ్ఎండీఏ అధికారులు తేల్చారు. బస్సులు నిలిపేందుకు సువిశాల విస్తీర్ణం, స్టాఫ్ క్యాంటీన్, రెస్ట్ రూమ్‌లు, ఐదంతస్తుల మల్టీలెవల్ పార్కింగ్, స్టార్ హోటల్ తదితరాలను 2,46,317.75 చదరపు మీటర్లలో నిర్మించవచ్చని లెక్కలు వేశారు. ఇది దిల్సుఖ్నగర్ మెట్రోస్టేషన్‌కు సమీపంలోనే ఉండటంతో.. ఐఎస్‌బీటీలో దిగిన ప్రయాణికులు సులువుగా ఐసీబీటీకి చేరుకొని నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లొచ్చని, తద్వారా నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. -
రేడియల్ రోడ్లపై బస్సు టెర్మినళ్లు
అఫ్జల్‌గంజ్,న్యూస్‌లైన్: గుర్తించిన రేడియల్ రోడ్ల పరిసర ప్రాంతాల్లో బస్టెర్మినళ్ల ఏర్పాటుకు ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హెచ్ఎండీఏ గుర్తించిన 33 రేడియల్ రోడ్లలో 22 రేడియల్ రోడ్లను ఆర్టీసీ అధికారులు బస్‌టెర్మినల్ నిర్మాణాలకు అనువైన ప్రాంతాలుగా గుర్తించినట్లు ఈడీ కోటేశ్వరరావు తెలిపారు. నేషనల్ హైవే, ఔటర్ రింగ్‌రోడ్డు కలిసే కూడళ్ల పరిసర ప్రాంతాల్లో స్థలం అవసరముందన్నారు. ప్రభుత్వం మూడు లేదా నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే ఆయా ప్రాంతాల్లో నూతన బస్టెర్మినళ్ల ఏర్పాటుకు వీలవుతుందన్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఘట్కేసర్, శామీర్‌పేట్, శంషాబాద్, కీసర, మొయినాబాద్, రామచంద్రాపురం, గండిమైసమ్మ, మేడ్చల్ పరిసరాలు బస్‌టెర్మినల్ నిర్మాణానికి అనువైన ప్రాంతాలుగా గుర్తించినట్లు వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పర్యావరణాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో ఆర్టీసీ మూడేళ్ల క్రితం 130 సీఎన్జీ గ్యాస్ బస్సుల్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ బస్సులు మేడ్చల్, హకీంపేట్, కంటోన్మెంట్ డిపోల పరిధిలో నడుస్తున్నాయన్నారు. ప్రతి రోజు ఒక్కో బస్సుకు 80 కేజీల చొప్పున సీఎన్జీ గ్యాస్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. డీజిల్ బస్సులు లీటరుకు నాలుగున్నర కిలో మీటర్లు, సీఎన్జీ గ్యాస్ బస్సులు కేజీకి మూడున్నర కిలో మీటర్ల చొప్పున మైలేజీ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ రెండు బస్సులకు పెద్దగా వ్యతాసం లేదని పేర్కొన్నారు. సీఎన్జీ గ్యాస్ కంపెనీలు ప్రస్తుతం సరఫరా చేస్తున్న గ్యాస్ కంటే అదనంగా సరఫరా చేసేందుకు సుముఖంగా లేకపోవడంతో అదనపు సీఎన్జీ బస్సుల్ని నడపలేకపోతున్నామని చెప్పారు. గతంలో మరిన్ని సీఎన్జీ గ్యాస్ బస్సులను కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిపారు.