సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు హబ్‌లపై దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని 21.78 ఎకరాల్లో ఉన్న కొత్తపేట పండ్ల మార్కెట్.. ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ (ఐఎస్‌బీటీ) నిర్మాణానికి అనువైనదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.150 కోట్ల వ్యయంతో 11 అంతస్తులతో మూడు టవర్లు నిర్మించడం ద్వారా ప్రయాణికులకు సకల సౌకర్యాలను ఒకేచోట అందుబాటులోకి తేవచ్చని తేల్చింది. ఇక్కడున్న పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలిస్తారు.
ఈట్, ఫన్, షాప్..
ప్రస్తుతం మార్కెటింగ్ విభాగం ఆధ్వర్యంలో ఉన్న పండ్ల మార్కెట్ స్థలంలో బస్సు ట్రాన్సిట్, పార్కింగ్, కమర్షియల్, రిటైల్ డెవలప్‌మెంట్, పోడియ మ్, హోటల్‌లు, మల్టీప్లెక్స్‌లను టవర్ స్ట్రక్చర్‌లో ఏర్పాటు చేస్తారు. బస్సుల రాకపోకలు, టెర్మినల్స్, ప్యాసింజర్ సౌకర్యాలు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్.. ఇలా అన్నీ ఒకేచోట ఉంటాయి. ఐఎస్‌బీటీ ఏర్పాటులో 3 టవర్లను నిర్మిస్తారు.
►1,29,275.96 చదరపు మీటర్ల ప్రాంతంలో 11 అంతస్తులతో కూడిన మొదటి టవర్‌లో బస్సుల హాల్టింగ్, పార్కింగ్ సౌకర్యాలు
►81,688.53 చ. మీ.లో రెండో టవర్‌లో షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్‌లు
►77,652.3 చ.మీలో మూడో టవర్‌లో హోటల్ అండ్ రెస్టారెంట్లు
ఐఎస్‌బీటీ ఎందుకంటే..
ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నగరానికి వందలాది ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. సిటీ బస్సులూ వేలల్లో తిరుగుతున్నాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. ఇక్కడ ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తూ, ప్రత్యామ్నాయంగా సౌకర్యాలు కల్పిస్తూ ఐఎస్‌బీటీ నిర్మాణానికి హెచ్‌ఎండీఏ అధికారులు ప్రణాళిక రచించారు. విజయవాడ హైవేకు దగ్గరగా ఉండటంతో పాటు ఏ ప్రాంతం నుంచైనా బస్సులు సులువుగా వచ్చి వెళ్లే వీలుండటంతో కొత్తపేట పండ్ల మార్కెట్‌ను ఎంపిక చేశారు. ఇక్కడికి వచ్చే ప్రయాణికులు.. నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా మెట్రో రైలూ అందుబాటులో ఉంటుంది.
దిల్‌సుఖ్‌నగర్ బస్ డిపోలో ఐసీబీటీ
ప్రతిపాదిత ఐఎస్‌బీటీకి కూతవేటు దూరంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ డిపో విస్తరించి ఉన్న 7.83 ఎకరాల ప్రాంతం ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ (ఐసీబీటీ) నిర్మాణానికి అనువైనదని హెచ్‌ఎండీఏ అధికారులు తేల్చారు. బస్సులు నిలిపేందుకు సువిశాల విస్తీర్ణం, స్టాఫ్ క్యాంటీన్, రెస్ట్ రూమ్‌లు, ఐదంతస్తుల మల్టీలెవల్ పార్కింగ్, స్టార్ హోటల్ తదితరాలను 2,46,317.75 చదరపు మీటర్లలో నిర్మించవచ్చని లెక్కలు వేశారు. ఇది దిల్‌సుఖ్‌నగర్ మెట్రోస్టేషన్‌కు సమీపంలోనే ఉండటంతో.. ఐఎస్‌బీటీలో దిగిన ప్రయాణికులు సులువుగా ఐసీబీటీకి చేరుకొని నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లొచ్చని, తద్వారా నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment