
బోయింగ్ ప్రతినిధితో భేటీ అయిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: విమానాల తయారీ సంస్థ ‘బోయింగ్ ఇంటర్నేషనల్’భవిష్యత్తులో రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరించే యోచనలో ఉన్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించింది. ఆ సంస్థ అధ్యక్షుడు మైఖేల్ ఆర్థర్, బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలిల్ గుప్తే, ఎండీ సురేంద్ర అహుజా, డైరెక్టర్ అశ్వినీ భార్గవ తదితరులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సోమవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ ప్రత్యేకతలతో పాటు, ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బోయింగ్ ఇంటర్నేషనల్ బృందంతో కేటీఆర్ చర్చించారు.
గత ఐదేళ్లలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు. బోయింగ్ సంస్థకు చెందిన టెక్నాలజీ, ఇంజనీరింగ్ డివిజన్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమెజాన్, సేల్స్ ఫోర్స్ హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
ఏరోస్పేస్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఏరోస్పేస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఇందులో బోయింగ్ సంస్థ కీలకంగా వ్యవహరించాలని కేటీఆర్ కోరారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment