సాక్షి, హైదరాబాద్: పట్టణ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన 256 బస్తీ దవాఖానాలు విజయవంతం కావడంతో వాటిని ఇతర పట్టణాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అన్ని మున్సి పాలిటీల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. జూన్ 2లోగా రెండు విడతల్లో వాటిని అందుబాటులోకి తీసుకురానుంది. మంగళవారం వైద్యారోగ్య, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా పట్టణాల్లో బస్తీ దవాఖానాల ఏర్పాటుపై చర్చించాయి.
ఈ సమీక్షలో వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ పరిధిలో బస్తీ దవాఖానాలు పట్టణ పేదలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాయని, ఇదే స్ఫూర్తితో 141 మున్సిపాలిటీల్లో మరో 288 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 544 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వస్తాయన్నారు. టీ డయాగ్నొస్టిక్స్ సహకారంతో కొత్తగా ఏర్పాటు చేసే బస్తీ దవాఖానాల్లో ఎక్కడికక్కడే రక్త నమూనాల సేకరణ ఉంటుందన్నారు. ఉచిత వైద్యం, ఉచిత మందులతోపాటు రోగ నిర్ధారణ పరీక్షలకు చేసే ఖర్చు కూడా పేదలకు తప్పుతుందని మంత్రి చెప్పారు.
వైద్యారోగ్య శాఖకు కేటీఆర్ శుభాకాంక్షలు..
నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో తెలంగాణ 3వ స్థానంలో నిలవడంపట్ల మంత్రి హరీశ్, వైద్యారోగ్య సిబ్బందికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏడేళ్లలో సీఎం కేసీఆర్ పాలనాదక్షత వల్ల ప్రభుత్వ వైద్య రంగం ముందుకు దూసుకెళ్తోందన్నారు. గతేడాది 4వ స్థానం నుంచి ఈ ఏడాది 3వ స్థానానికి చేరడం అభినందనీయమన్నారు. వచ్చే ఏడాది ఆరోగ్య సూచీలో తెలంగాణ మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment