అమెరికన్ దిగ్గజ విమాన తయారీ సంస్థ 'బోయింగ్'.. 438మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేసింది. గతంలోనే ఈ సంస్థ ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన విషయాన్ని వెల్లడించినప్పటికీ.. ఎట్టకేలకు లేఆఫ్ నోటీసులను జారీ చేసింది. యూఎస్‌లోని సియాటెల్ ప్రాంతంలో కంపెనీకి చెందిన 33వేల మంది ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడంలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది.
ఆర్ధిక పరమైన సమస్యలను రూపుమాపుకోవడానికి మాత్రమే కాకుండా.. ఉత్పత్తిలో జరిగిన ఆలస్యాలను దృష్టిలో ఉంచుకుని బోయింగ్ 438 మందికి లేఆఫ్ నోటీసులు అందించింది. ఇందులో 218 మంది ఇంజనీర్లు, సొసైటీ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ ఎంప్లాయీస్ ఇన్ ఏరోస్పేస్ (SPEEA) యూనిట్‌లోని సభ్యులు, మిగిలినవారు టెక్నీకల్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కంపెనీ తన ఉద్యోగులను తొలగించినప్పటికీ.. అర్హత కలిగిన వారికి మూడు నెలల వరకు కెరీర్ ట్రాన్సిషన్ సేవలు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందించనున్నట్లు సమాచారం.
సమ్మె ఎఫెక్ట్
సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులు సమ్మె చేయడం వల్ల.. 737 మ్యాక్స్, 767, 777 జెట్‌ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది. బోయింగ్ ఉన్న పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని కంపెనీ సీఈఓ గత నెలలోనే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment