సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ భారీ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేయనుంది. కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా విమానయాన రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో బోయింగ్ సుమారు 12వేల మందిని తొలగించేందుకు నిర్ణయించింది. రాబోయే కొద్ది నెలల్లో అనేక వేల ఉద్యోగాలను తొలగించనున్నామని బోయింగ్ ప్రతినిధి బుధవారం తెలిపారు. అయితే ఎంతమంది అనేది స్పష్టంగా పేర్కొనలేదు.
కోవిడ్-19 మహమ్మారి వైమానిక పరిశ్రమను ఘోరంగా దెబ్బతీసిందని, దీంతో రాబోయే కొన్నేళ్లలో వాణిజ్య జెట్‌ల తయారీని బాగా తగ్గించనున్నామని బోయింగ్ సీఈవో డేవిడ్ కాల్హౌన్ ఉద్యోగులకు అందించిన సమాచారంలో తెలిపారు. 6770 అమెరికా ఉద్యోగులను ఈ వారంలో తొలగిస్తామనీ, మరో 5,520 మంది స్వచ్ఛందంగా సంస్థను వీడడానికి అంగీకరించారని వెల్లడించారు. తమ ఉద్యోగుల్లో 10 శాతం తగ్గించుకుంటామని డేవిడ్ చెప్పారు. అంతర్జాతీయంగా కూడా ఉద్యోగ కోతలు ఉంటాయన్నారు. (విమానం ఎక్కుతానని ఎప్పుడూ అనుకోలేదు)
మరోవైపు ఏడాది క్రితం ఇదే సమయంతో పోలిస్తే విమాన ప్రయాణీకుల సంఖ్య 89 శాతం తగ్గిందని ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం వెల్లడించింది. కాగా లాక్‌డౌన్ కఠిన ఆంక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలు స్థంబించిపోయాయి. ప్రస్తుతం కాస్త పుంజుకున్నప్పటికీ, అమెరికాలో విమానయాన రంగ ఆదాయం ఏప్రిల్ మధ్య కాలంలో 96 శాతం పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment