వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్ హిప్కిన్స్ చైనా పర్యటనలో భాగంగా తన అధికారిక బృందంతో కలిసి రెండు విమానాల్లో బయలుదేరి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తమ మిత్రదేశమైన చైనాతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్ తన ప్రతినిధుల బృందంతో కలిసి బయలుదేరారు. అయితే వారంతా ఒక బోయింగ్ 757 విమానంలో వెళుతుండగా వెనుక మరో విమానాన్ని కూడా తమ వెంట తీసుకుని వెళ్లారు. అది ప్రస్తుతం ఫిలిపీన్స్ లోని మనీలా వరకు వారితో పాటు వెళ్ళింది.
ఈ నేపథ్యంలో వెల్లింగ్టన్ వర్గాలు దీనిపై వివరణ ఇచ్చాయి. అతిపెద్ద వ్యాపార భాగస్వామి అయిన చైనాతో జరగబోయే చర్చలు ప్రయోజనకరంగా సాగాలని దూరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఒక వేళ ఒక విమానంలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ప్రత్యామ్నాయంగా రెండో విమానం ఉపయోగపడుతుందని ఈ విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు.
ఈ బోయింగ్ 757 విమానాలు 30 ఏళ్ల నాటివి. వాటి సర్వీసు ముగింపు దశకు వచ్చింది. 2028 లేదా 2030లో వాటిని మార్చే అవకాశముందని ప్రధానమంత్రి కార్యాలయం ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్షాల నాయకులు న్యూజిలాండ్ ప్రధానిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇదేదో ఒక ఫోన్ చార్జర్ పని చేయకపోతే ఇంకో చార్జర్ వెంట తీసుకుని వెళ్ళినట్టుందని వారు ఎద్దేవా చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: వెయ్యి ఏళ్ల నాటి మసీదు సందర్శించిన మోదీ.. ప్రత్యేకత ఏంటంటే..
Comments
Please login to add a commentAdd a comment