
న్యూఢిల్లీ: భారత్‌లో విమానాల నిర్వహణ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)తో కలిసి పదేళ్ల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు బోయింగ్ తెలియజేసింది. ఈ రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు తాము సాంకేతిక సహకారం అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ కార్యాచరణ ప్రణాళిక 18 నెలల్లో సిద్ధం కావచ్చని, అమెరికా ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(యూఎస్‌టీడీఏ) నిధులతో దీన్ని చేపట్టనున్నామని సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఏఏఐ నేతృత్వంలో 125 విమానాశ్రయాలను కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా, స్థానికంగా ఉన్న అత్యుత్తమ ప్రమాణాలకు లోబడి జాతీయ ఎయిర్‌స్పేస్ వ్యవస్థను ఆధునీకరించడానికి ఈ రోడ్‌మ్యాప్ మార్గదర్శకత్వం వహిస్తుంది. ఎయిర్‌స్పేస్ సామర్థ్యాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకునేలా, కమ్యూనికేషన్స్‌ను పెంచడం, నిఘా, విమానాల రద్దీ నియంత్రణలోనూ ఈ రోడ్‌మ్యాప్ ఉపకరిస్తుందని బోయింగ్ పేర్కొంది. ఈ విషయంలో డీజీసీఏతోనూ కలసి పనిచేస్తామని ప్రకటించింది. ఆధునిక టెక్నాలజీలు, అంతర్జాతీయ విధానాలను అమలు చేయడం ద్వారా భారత్ తన గగనతల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోగలదని ఏఏఐ చైర్మన్ గురుప్రసాద్ మొహపాత్రా పేర్కొన్నారు.