విమానాలకు భారీ డిమాండ్
♦ వచ్చే 20 ఏళ్లలో 1,740 విమానాలు కావాలి
♦ భారత్‌ది ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిరేటు
♦ బోయింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ కేశ్కర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తగ్గిన ఇంధన ధరలు దేశీ విమాన కంపెనీలకు లాభాలను కురిపిస్తున్నట్లు విమాన తయారీ సంస్థ బోయింగ్ పేర్కొంది. 2013లో విమానాల నిర్వహణ వ్యయంలో ఇంధనం వాటా 49 శాతంగా ఉంటే అది ఇప్పుడు 23 శాతానికి పడిపోయిందని బోయింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ కేశ్కర్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సగటు విమాన టికెట్ ధరలు తగ్గడం కూడా ఈ పరిశ్రమ వేగంగా విస్తరించడానికి ఒక కారణమని చెప్పారు. ‘‘రెండేళ్ల క్రితం సగటు టికెట్ ధర రూ.7,492 ఉండేది. అపుడు కంపెనీలకు టికెట్‌పై రూ.256 నష్టం వచ్చేది. కానీ ఇపుడు సగటు టికెట్ ధర రూ.5,734కి తగ్గింది. దీంతో టికెట్‌కు రూ.632 చొప్పున లాభం వస్తోంది.
అందుకే విమానయాన సంస్థలు కొత్త విమానాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి’’ అని వివరించారాయన. ఇండియాలో ఉన్న ఈ డిమాండ్‌ను అందుకోవాలంటే వచ్చే ఇరవై ఏళ్లకు 1,740 కొత్త విమానాలు అవసరమవుతాయని అంచనా వేసినట్లు కేశ్కర్ తెలిపారు. ఇందుకోసం సుమారు రూ. 16 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయన్నారు. ‘‘దేశీయ ప్రయాణికుల సంఖ్యలో గతేడాది 21 శాతం వృద్ధి నమోదయింది. ఈ రేటు ప్రపంచంలోనే అత్యధికం. 2014లో 6.6 కోట్లుగా ఉన్న ప్రయాణీకుల సంఖ్య 2015లో 8 కోట్లకు చేరుకుంది. ప్రాంతీయ విమాన సేవలు విస్తరిస్తుండటంతో చిన్న విమానాలకు మంచి డిమాండ్ వస్తోంది’’ అన్నారు. నాగపూర్‌లో తాము ఏర్పాటు చేసిన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్(ఎంఆర్‌వో) యూనిట్ గత జూన్ నెల నుంచి అందుబాటులోకి వచ్చిందన్నారు.