న్యూఢిల్లీ/వాషింగ్టన్: టాటా గ్రూప్ సారథ్యంలోని ఎయిరిండియా సంస్థ దేశ విదేశాల్లో తన కార్యకలాపాలను మరింత విస్తరింపజేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ నుంచి, అమెరికాలోని బోయింగ్ నుంచి మొత్తం 470 కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. కొత్త విమానాల కోసం ఎయిర్ ఇండియా ఆర్డర్ ఇవ్వడం గత 17 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత ఇచ్చిన తొలి ఆర్డర్ కూడా ఇదే.
‘‘40 ఎయిర్‌బస్ ఏ350 విమానాలు, 20 బోయింగ్ 787 విమానాలు, 10 బోయింగ్ 777–9 విమానాలు, 210 ఎయిర్‌బస్ ఏ320/321 నియో విమానాలు, 190 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కొంటున్నాం’’ అని ఎయిర్ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మొదటి విమానం ఈ ఏడాది ఆఖర్లో సర్వీసులో చేరుతుందని పేర్కొంది. 2025 జూలై నుంచి విమానాలు తమకు అందుతాయని తెలియజేసింది. లీజుకు తీసుకున్న 11 బీ777, 25 ఏ320 విమానాల డెలివరీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని స్పష్టం చేసింది. రెండు ఒప్పందాల విలువ ఏకంగా 80 బిలియన్ డాలర్లు (రూ.6.4 లక్షల కోట్లు) అని అంచనా!
సుదీర్ఘ ప్రయాణాలకు వైడ్–బాడీ విమానాలు
ఎయిర్‌బస్ నుంచి 250 విమానాలను కొనడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేశామని ‘టాటా సన్స్’ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మంగళవారం చెప్పారు. ఎయిర్‌బస్ నుంచి 210 నారో–బాడీ విమానాలు, 40 వైడ్–బాడీ విమానాలు కొంటున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ తదితరులు వర్చువల్‌గా పాల్గొన్న కార్యక్రమంలో చంద్రశేఖరన్ మాట్లాడారు. ఎక్కువ సమయం(అల్ట్రా–లాంగ్ హాల్) సాగే ప్రయాణాల కోసం వైడ్–బాడీ విమానాలు ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు.
16 గంటలకు పైగా ప్రయాణించే విమానాన్ని అల్ట్రా–లాంగ్ హాల్ ఫ్లైట్ అంటారు. భారత ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న ఎయిరిండియాను 2022లో టాటా గ్రూప్ దక్కించుకోవడం తెలిసిందే. ఎయిర్ ఇండియా చివరిసారిగా 2005లో విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. అప్పట్లో బోయింగ్ సంస్థ నుంచి 68, ఎయిర్‌బస్ నుంచి 43 విమానాలను కొనుగోలు చేసింది. 2005లో ఈ డీల్ విలువ 10.8 బిలియన్ డాలర్లు.
ఒప్పందాల పట్ల ప్రధాని మోదీ హర్షం
ఎయిర్‌బస్, బోయింగ్‌తో ఎయిరిండియా ఒప్పందాలపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇవి మైలురాయి లాంటి ఒప్పందాలన్నారు. భారత్‌లో విమానయాన రంగం వృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. 15 ఏళ్లలో 2,000కు పైగా విమానాలు అవసరమని చెప్పారు. మన పౌర విమానయాన రంగం దేశ అభివృద్ధిలో అంతర్భాగమని వ్యాఖ్యానించారు. దేశంలో గత ఎనిమిదేళ్లలో ఎయిర్‌పోర్టుల సంఖ్య 74 నుంచి 147కు చేరిందని గుర్తుచేశారు. ‘ఉడాన్’ పథకం కింద మారూమూల ప్రాంతాలను సైతం విమానాల ద్వారా అనుసంధానిస్తున్నామని పేర్కొన్నారు.
విమానయాన రంగంలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించబోతోందన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి, ఉక్రెయిన్–రష్యా సమస్యను పరిష్కరించే సత్తా మోదీ నాయకత్వంలోని భారత్‌కుందని ప్రశంసించారు. భారత జి–20 సారథ్యం విజయవంతం కావడానికి సహకరిస్తున్నామని చెప్పారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ మంగళవారం ఫోన్‌లో మాట్లాడారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఎయిరిండియా–బోయింగ్ ఒప్పందంతోపాటు పలు అంశాలపై నేతలు చర్చించుకున్నారని వెల్లడించింది.
చరిత్రాత్మక ఒప్పందం: జో బైడెన్
34 బిలియన్ డాలర్లతో బోయింగ్ నుంచి 220 విమానాల కొనుగోలుకు ఎయిరిండియా ఒప్పందాన్ని చరిత్రాత్మకంగా బైడెన్ అభివర్ణించారు. ‘‘అవసరాన్ని బట్టి మరో 70 విమానాలు కొనేలా ఒప్పందం కుదిరింది. అలా మొత్తం ఒప్పందం విలువ 45.9 బిలియన్ డాలర్లు. ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తున్నాం’’ అన్నారు. వైట్‌హౌస్ ప్రకటన మేరకు బోయింగ్‌తో ఒప్పందంలో 50 బోయింగ్ 737మ్యాక్స్, 20 బోయింగ్ 787 ఫ్లైట్లు ఉన్నాయి. ఎయిరిండియా ఇచ్చిన ఆర్డర్ బోయింగ్ చరిత్రలో డాలర్ విలువలో మూడో అతిపెద్ద సేల్, విమానాల సంఖ్యలో రెండో అతి పెద్దది!
కీలక ఘట్టం: రిషి
లండన్: ఎయిరిండియాకు 250 కొత్త విమానాలు విక్రయించడానికి ‘ఎయిర్‌బస్–రోల్స్ రాయిస్’ ఒప్పందానికి రావడంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హర్షం బెలిబుచ్చారు. బ్రిటన్ ఏరోస్పేస్ రంగంలో ఇదో కీలక ఘట్టమన్నారు. ‘‘భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. బ్రిటన్‌లో విమానయాన రంగ అభివృద్ధికి ఆకాశమే హద్దు అనేందుకు ఈ ఒప్పందమే తార్కాణం’’ అన్నారు. ఈ ఒప్పదంతో బ్రిటన్లోని వేల్స్, డెర్బీషైర్‌లో కొత్త ఉద్యోగాలు వస్తాయని, ఎగుమతులకు, ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం లభిస్తుందని యూకే ప్రభుత్వం వెల్లడించింది. ఎయిరిండియా కొనుగోలు చేసే 250 విమానాల తయారీ ప్రక్రియ చాలావరకు యూకేలోనే పూర్తి కానున్నట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment