
స్పైస్‌జెట్‌తో బోయింగ్ ఒప్పందం
♦ 40 విమానాల తయారీ కోసం ఎంవోయూ
♦ 4.7 బిలియన్ డాలర్ల విలువ
ముంబై: చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్పైస్‌జెట్.. ’737 మ్యాక్స్ 10’ విమానాలు నలభై కొనుగోలు చేయనుంది. ప్రస్తుత ధరల ప్రకారం ఈ డీల్ విలువ సుమారు 4.7 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 30వేల కోట్లు) ఉండనుంది. సోమవారం ప్రారంభమైన ప్యారిస్ ఎయిర్‌షో సందర్భంగా కుదిరిన ఎంవోయూ ప్రకారం.. రెండు ఆర్డర్ల కింద ఈ విమానాలను సరఫరా చేయాల్సి ఉంటుంది.
737 శ్రేణిలో కొత్త వెర్షన్‌ను ఆర్డరు చేసిన తొలి భారతీయ సంస్థ తమదేనని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. వ్యయాలు తగ్గించుకునేందుకు, ఆదాయాలు మెరుగుపర్చుకునేందుకు ఈ విమానాలు ఉపయోగపడగలవని వివరించారు. వచ్చే ఏడాది కొత్త 737 విమానాల రాకతో తమ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించగలమన్నారు. బోయింగ్ నుంచి సుమారు 22 బిలియన్ డాలర్ల విలువ చేసే కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లు 205 దాకా (2014లో ఇచ్చిన 55 విమానాల ఆర్డరుతో సహా) కొనుగోలు చేయనున్నట్లు స్పైస్‌జెట్ ఇటీవలే తెలిపింది. ప్రస్తుతం స్పైస్‌జెట్‌కి 55 విమానాలు ఉన్నాయి.