
న్యూయార్క్: మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల వివాదం కారణంగా ప్రతిష్ట మసకబారడంతో .. విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డెనిస్ ములెన్‌బర్గ్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పదవి నుంచి తప్పించింది. ప్రస్తుతం బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న డేవిడ్ కాలోన్‌కు సీఈవో, ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించింది. నియంత్రణ సంస్థలు, కస్టమర్లు, ఇతర వర్గాలతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు, వారి విశ్వాసం చూరగొనేందుకు ఈ మార్పులు అవసరమని బోయింగ్ పేర్కొంది. పూర్తి పారదర్శకంగా పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామని ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం డెనిస్ ములెన్‌బర్గ్ తక్షణమే పదవి నుంచి తప్పుకోనున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న కాలొన్ కొత్త బాధ్యతలు చేపడతారని బోయింగ్ తెలిపింది. ఈలోగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గ్రెగ్ స్మిత్.. తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తారని వివరించింది. 737 మ్యాక్స్ రకానికి చెందిన రెండు విమానాలు కుప్పకూలడంతో ఈ విమానాలను పూర్తిగా పక్కన పెట్టాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.