డ్రీమ్‌లైనర్ విమానం.. మళ్లీ తుస్!
డ్రీమ్ లైనర్ విమానంలో మళ్లీ సమస్య తలెత్తింది. జపాన్ డ్రీమ్‌లైనర్ విమానం ఇంజన్ వేడెక్కడంతో కౌలాలంపూర్ నుంచి బయల్దేరిన విమానం.. గంటలోపే వెనక్కి తిరిగి వచ్చేసింది. ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అనేక ఇబ్బందులను చవిచూస్తున్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ తాజా ఘటనలతో మరో సమస్యలో పడినట్లు జపనీస్ ఎయిర్ లైన్స్ చెబుతోంది. కుడి ఇంజన్‌లో సమస్య వచ్చే సమయానికి విమానంలో 203 మంది ప్రయాణికులతో పాటు, 11 మంది సిబ్బంది ఉన్నారు.
ఉదయం 8 గంటలకు కౌలాలంపూర్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం ఇంజన్ తీవ్రంగా వేడెక్కడంతో అప్రమత్తమైన సిబ్బంది.. 9.30 గంటల ప్రాంతంలో కౌలాలంపూర్‌లో మళ్లీ ల్యాండ్ చేశారని అధికారులు తెలియజేశారు. ప్రమాదాన్ని గుర్తించి అత్యవసరంగా దింపేయడంతో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, పెద్ద ముప్పు తప్పిందని తెలిపారు. మధ్యాహ్నం 3.15 గంటలకు విమానం నరితా ఎయిర్ పోర్టుకు చేరాల్సి ఉండగా.. ఉన్నట్లుండి విమానంలోని కుడి ఇంజన్లో ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో గుర్తించిన సిబ్బంది విమానాన్ని వెనక్కి తిప్పాల్సివచ్చిందని ఎయిర్ వేస్ ప్రతినిధి షోచిరో హోరీ తెలిపారు. అయితే అత్యధిక వేడి సమస్య ఎందుకు తలెత్తిందన్న విషయంపై విచారిస్తున్నట్లు తెలిపారు.
ఇంధన వాడకాన్ని తగ్గించడంలో భాగంగా తేలికైన మిశ్రమ పదార్థాలతో డ్రీమ్ లైనర్ విమానాలను తయారు చేశారు. అభివృద్ధి దశలో వచ్చిన అనేక సమస్యలను దాటి ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్ (ఏఎన్ఏ) 2011లో తొలి వాణిజ్య విమానాన్ని పరిచయం చేసింది. అనంతరం 2013లో డ్రీమ్‌లైనర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేక విద్యుత్ సమస్య తలెత్తింది. సంవత్సరం మొదట్లో బ్యాటరీ సమస్యతో అనేక విమానాల్లో సమస్యలు తెలత్తగా, ఒక విమానం బ్యాటరీ వేడెక్కడంతో అగ్నిప్రమాదం కూడా సంభవించింది. దీంతో లోపాలను సరిదిద్దేందుకు ఓ పక్క ప్రయత్నాలు జరుగుతుండగా తాజాగా కౌలాలంపూర్ విమానం ఘటన వెలుగుచూసింది.