బోయింగ్ విమానాలు పాతపడే కొద్దీ అత్యంత ప్రమాదకరంగా మారబోతున్నాయని ఆ కంపెనీలో 10 ఏళ్లకుపైగా ఇంజినీర్‌గా పనిచేసిన సామ్ సలేహ్‌పార్ తెలిపారు. ఇటీవల కాలంలో బోయింగ్ మోడళ్లలో లోపాలు తలెత్తడంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిన్‌స్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది.
తాజాగా బోయింగ్ సంస్థపై సామ్ చేసిన ఆరోపణలను సైతం పరిశీలిస్తున్నట్లు ఎఫ్‌ఏఏ విచారణ అధికారులు తెలిపారు. సామ్ ఎఫ్‌ఏఏకు చేసిన ఫిర్యాదులో ‘బోయింగ్ 777, 787 డ్రీమ్‌లైనర్లలో లోపాలున్నాయి. బోయింగ్ విమానాల తయారీ సమయంలో సంస్థ షార్ట్‌కట్లను వాడుతోంది. దాంతో అవి పాతబడేకొద్దీ ఈ లోపాలు ప్రమాదకరంగా మారబోతున్నాయి. ఇతర ప్రాంతాల్లో తయారైన విడిభాగాలను అనుసంధానం చేసే క్రమంలో సరైన విధానాలను పాటించడం లేదు. 2019లో సౌత్ కరోలినాలోని చార్లెస్టన్‌లోని ప్లాంట్‌లో బోయింగ్ 787 తయారు చేస్తున్న సమయంలో పని త్వరగా పూర్తి చేయాలని కార్మికులపై ఒత్తిడి తెచ్చారు. ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. ఈ విషయాలు పబ్లిక్‌డొమైన్‌లో పెట్టడంతో కంపెనీ ప్రతీకారచర్యలకు సైతం దిగుతుంది’ అంటూ వివరించాడు. సామ్ తరపు న్యాయవాది డెబ్రా ఎస్‌కాట్జ్ మాట్లాడుతూ ‘సామ్ చేసిన ఆరోపణల ఫలితంగా కంపెనీ తనను 787 ప్రాజెక్టు నుంచి తప్పించి 777 ప్రాజెక్ట్‌కు బదిలీ చేసింది. చివరికి అక్కడ కూడా సామ్ లోపాలు గుర్తించాడు’ అని అన్నారు.
ఇటీవల సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం 135 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో డెన్వర్ ఎయిర్‌పోర్టు నుంచి హోస్టన్‌కు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఇంజిన్ కవర్ ఊడిపోయింది. గతంలోనూ అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్ గాల్లో ఉండగానే డోర్ ఒక్కసారిగా ఊడిపోయిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: మే 15 నుంచి ‘గూగుల్ ఫొటోస్’లో మార్పులు
ఇటీవల జపాన్‌లో అల్ నిప్పాన్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 737-800 కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు గుర్తించిన పైలట్లు.. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment