ఎఫ్‌డీఐ పరిమితి పెంచితే మరిన్ని పెట్టుబడులు: బోయింగ్ | India will see more US investments at 49% FDI in Defence: Boeing | Sakshi
Sakshi News home page

ఎఫ్‌డీఐ పరిమితి పెంచితే మరిన్ని పెట్టుబడులు: బోయింగ్

Published Sat, Feb 15 2014 1:21 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

ఎఫ్‌డీఐ పరిమితి పెంచితే  మరిన్ని పెట్టుబడులు: బోయింగ్ - Sakshi

ఎఫ్‌డీఐ పరిమితి పెంచితే మరిన్ని పెట్టుబడులు: బోయింగ్

భారత్ గనుక రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచితే... అమెరికా కంపెనీల నుంచి మరిన్ని పెట్టుబడులు వెల్లువెత్తుతాయని విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ పేర్కొంది.

 సింగపూర్: భారత్ గనుక రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచితే... అమెరికా కంపెనీల నుంచి మరిన్ని పెట్టుబడులు వెల్లువెత్తుతాయని విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ పేర్కొంది. ప్రస్తుతం ఈ పరిమితి 26 శాతంగా ఉంది. సింగపూర్ ఎయిర్‌షోలో పాల్గొన్న సందర్భంగా బోయింగ్ వైస్ ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ జనరల్ జెఫ్ కోహ్లెర్ ఈ అంశంపై మాట్లాడారు. భారత ప్రభుత్వం రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని సమీప భవిష్యత్తులో పెంచొచ్చనే అంచనాలు ఉన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 ‘ఇప్పుడున్న 26 శాతం పరిమితితో మా కంపెనీ యాజమాన్యం భారత్‌లో మరిన్ని పెట్టుబడులకు ముందుకురావడం కష్టం. ఇక్కడున్న భారీ మార్కెట్‌పై మా సహచరులతో చాలాసార్లు చర్చించా. అయితే, 49 శాతం లేదా 40 శాతం కంటే ఎక్కువ వాటాకు ఆమోదం లభిస్తే కచ్చితంగా యాజమాన్యాన్ని ఒప్పించేందుకు ఆస్కారం ఉంటుంది’ అని కోహ్లెర్ పేర్కొన్నారు.

 పన్నుల విధానాన్ని సమీక్షించాలి: బంబార్డియర్
 చిన్న విమానయాన కంపెనీలకు భారత్‌లో నిర్వహణ లాభదాయకంగా ఉండాలంటే విమానాలపై ప్రస్తుత పన్నుల విధానాన్ని సమీక్షించడంతోపాటు అధిక ఇంధన ధరల భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కెనడాకు చెందిన విమానాల తయారీ సంస్థ బంబార్డియర్ సూచించింది.

 76 సీట్లకు మించిన విమానాలపై భారత్ అదనపు పన్నులను విధిస్తోందని బంబార్డియర్ వైస్‌ప్రెసిడెంట్ టాబ్‌జార్న్ కారిసన్ పేర్కొన్నారు. 29-149 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉన్న విమానాలను నడుపుకునేందుకు చిన్న ఎయిర్‌లైన్స్‌కు అనుమతించాలని ఆయన అభిప్రాయపడ్డారు. బంబార్డియర్‌కు భారత్‌లో స్పైస్‌జెట్ అతిపెద్ద కస్టమర్(15 విమానాలు)గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement