Winnipeg
-
స్క్వాష్ @ 800 ఏళ్లు
తవ్వకాల్లో బయటపడిన 800 ఏళ్ల నాటి విత్తనాల్ని సాగు చేస్తున్నారు కెనడాలోని విన్నీపెగ్కు చెందిన కెనడియన్ మెన్నోనైట్ విశ్వవిద్యాలయం విద్యార్థులు. బడి, కళాశాల, విశ్వవిద్యాలయాల్లో మొక్కల్ని పెంచడం సర్వసాధారణం. అయితే కెనడాలోని కెనడియన్ మెన్నోనైట్ యూనివర్శిటికి చెందిన విద్యార్థులు మాత్రం పురాతన విత్తనాల్ని సాగుచేస్తూ వార్తల్లో నిలిచారు. కెనడాలోని పురావస్తు శాస్త్రరీత్యా ప్రాధాన్యత కలిగిన ‘ఫస్ట్ నేషన్స్ ల్యాండ్’ ప్రదేశాల్లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఈ పురాతన విత్తనాలు వెలుగు చూశాయి. ఈ తవ్వకాల్లో 800 ఏళ్ల నాటి మట్టి పాత్ర ఒకటి బయటపడింది. ఆ పాత్రనిండా విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలను స్క్వాష్ విత్తనాలుగా గుర్తించారు పురావస్తు విభాగం శాస్త్రవేత్తలు. ఈ విత్తనాలను కెఎంయూకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున సాగు చేయడం మొదలు పెట్టారు. ఆ విత్తనాలు మొలకెత్తి ఏపుగా పెరుగుతున్నాయి. మరికొన్ని మొక్కలు కాయల్ని కూడా కాస్తున్నాయి. చూడ్డానికి కూరగాయకంటే పెద్దగా ఉన్న ఈ స్క్వాష్ కాయ చాలా పొడవుగా పెరుగుతోంది. అయితే, విద్యార్థులు మాత్రం ఈ కాయను విత్తనాల కోసం అలాగే ఉంచేస్తున్నారు. ‘ఈ స్క్వాష్ కూరగాయ గిరిజన తెగకు చెందిన ఓ వర్గానికి ప్రతీకగా మేం భావిస్తున్నాం. భవిష్యత్తు తరాలకు ఈ స్క్వాష్ కాయను అందించాల నుకుంటున్నాం. ఈ స్క్వాష్ కాయనుంచి మరిన్ని విత్తనాలు సేకరించాలనుకుంటున్నాం. ఈ స్క్వాష్ విత్తనాన్ని మరోసారి నాశనం కానివ్వమంటు’న్నారు విన్నీపెగ్ కు చెందిన మొక్కల పెంపకం సమన్వయకర్త బ్రెయిన్ ఎత్కిన్. -
ఎఫ్‌డీఐ పరిమితి పెంచితే మరిన్ని పెట్టుబడులు: బోయింగ్
సింగపూర్: భారత్ గనుక రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచితే... అమెరికా కంపెనీల నుంచి మరిన్ని పెట్టుబడులు వెల్లువెత్తుతాయని విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ పేర్కొంది. ప్రస్తుతం ఈ పరిమితి 26 శాతంగా ఉంది. సింగపూర్ ఎయిర్‌షోలో పాల్గొన్న సందర్భంగా బోయింగ్ వైస్ ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ జనరల్ జెఫ్ కోహ్లెర్ ఈ అంశంపై మాట్లాడారు. భారత ప్రభుత్వం రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని సమీప భవిష్యత్తులో పెంచొచ్చనే అంచనాలు ఉన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఇప్పుడున్న 26 శాతం పరిమితితో మా కంపెనీ యాజమాన్యం భారత్‌లో మరిన్ని పెట్టుబడులకు ముందుకురావడం కష్టం. ఇక్కడున్న భారీ మార్కెట్‌పై మా సహచరులతో చాలాసార్లు చర్చించా. అయితే, 49 శాతం లేదా 40 శాతం కంటే ఎక్కువ వాటాకు ఆమోదం లభిస్తే కచ్చితంగా యాజమాన్యాన్ని ఒప్పించేందుకు ఆస్కారం ఉంటుంది’ అని కోహ్లెర్ పేర్కొన్నారు. పన్నుల విధానాన్ని సమీక్షించాలి: బంబార్డియర్ చిన్న విమానయాన కంపెనీలకు భారత్‌లో నిర్వహణ లాభదాయకంగా ఉండాలంటే విమానాలపై ప్రస్తుత పన్నుల విధానాన్ని సమీక్షించడంతోపాటు అధిక ఇంధన ధరల భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కెనడాకు చెందిన విమానాల తయారీ సంస్థ బంబార్డియర్ సూచించింది. 76 సీట్లకు మించిన విమానాలపై భారత్ అదనపు పన్నులను విధిస్తోందని బంబార్డియర్ వైస్‌ప్రెసిడెంట్ టాబ్జార్న్ కారిసన్ పేర్కొన్నారు. 29-149 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉన్న విమానాలను నడుపుకునేందుకు చిన్న ఎయిర్‌లైన్స్‌కు అనుమతించాలని ఆయన అభిప్రాయపడ్డారు. బంబార్డియర్కు భారత్‌లో స్పైస్‌జెట్ అతిపెద్ద కస్టమర్(15 విమానాలు)గా ఉంది.