తొలిసారిగా అంతరిక్షంలో డీఎన్ఏ అమరిక
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తొలిసారిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో జన్యుక్రమ అమరికను విజయవంతంగా నిర్వహించింది. అంతరిక్షంలో జీవుల జన్యుక్రమ అమరిక సామర్థ్యం శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు తెర తీస్తుందని నాసా పేర్కొంది. నాసాకు చెందిన కేట్ రుబిన్స్ చేపట్టిన బయోమాలిక్యుల్ సీక్వెన్స్ ప్రయోగంలో భాగంగా అతి తక్కువ గురుత్వశక్తిలో తొలిసారిగా డీఎన్‌ఏను క్రమపద్ధతిలో అమర్చారు. ఈ ప్రయోగం వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో అనారోగ్య పరిస్థితులను గుర్తించడమే కాకుండా, సూక్ష్మజీవులను కనిపెట్టడంతో పాటు వాటివల్ల వ్యోమగాములకు ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయా లేదా అనేది తెల్సుకునేందుకు వీలవుతుంది.