సాహసం అంటే సునీతకు సరదా! అంతరిక్షంలో భారరహిత స్థితిలో తలకిందులుగా తేలియాడుతూ... ‘డ్యూటీ’ చేయటం ఆమెకొక విహారం. ఇక స్పేస్‌లో ఉన్నన్నాళ్లూ ఒక్క రోజు కూడా ఆమె వ్యాయామం ఆపలేదు! ఆరోగ్యానికి, ఎముకల దృఢత్వానికి మేలు చేసే ఎక్సర్‌సైజ్‌లే అన్నీ.
మానసికంగా శక్తినిచ్చే సాధనకు సైతం ఏనాడూ ఆమె విరామం ఇవ్వలేదు. ఆ సాధనే... అనుదిన భగవద్గీత పఠనం. ప్రస్తుతం సునీత ఆ అంతరిక్షంలోనే చిక్కుబడిపోయారు. భూమిపై అందరూ ఆమె కోసం భయాందోళనలు చెందుతూ ఉంటే ఆమె మాత్రం... చిరునవ్వుతో... ‘‘వచ్చేస్తాగా...’’ అని తనే రివర్స్‌లో నాసాకు, భారతీయులకు నమ్మకం ఇస్తున్నారు!
సునీతా విలియమ్స్ గత 53 రోజులుగా అంతరిక్షంలోనే ఉండిపోయారు. సునీతను, సహ వ్యోమగామి బచ్ విల్మోర్‌ను భూకక్ష్యకు 400 కి.మీ ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఐ) విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్‌లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడికి చేర్చాక చేతులెత్తేసింది. జూన్ 5న వాళ్లు వెళ్లారు. తిరిగి జూన్ 12కి, కనీసం జూన్ 15 కి వారు భూమి పైకి రావలసింది.
స్టార్‌లైనర్‌లోని రాకెట్ మోటార్లు (థ్రస్టర్స్) మొరాయించటంతో విల్మోర్‌తో పాటుగా సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. మరోవైపు నాసా టీమ్ భూమి మీద నుంచే ఆకాశంలోని స్టార్ లైనర్‌కు నెలన్నరకు పైగా మరమ్మతులు చేస్తూ ఉంది. స్టార్‌లైనర్ మానవ ప్రయాణానికి పనికొస్తుందా లేదా అని ప్రత్యక్షంగా పరీక్షించేందుకు వెళ్లిన సునీత, విల్మోర్ అక్కడే ఉండిపోయారు. వారు ఎప్పటికి తిరిగొస్తారు అనే ప్రశ్నకైతే ఇప్పటి వరకు సమాధానం లేదు.
తాజాగా చిన్న ఆశ మినుకుమంది! థ్రస్టర్స్‌ని మండించి చూసిన నాసాకు అవి పని చేయబోతున్న సంకేతాలు కనిపించాయి. ఇది గుడ్ న్యూస్. నాసాకే కాదు, సునీతా విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్న యావత్భారతావనికి కూడా. ‘‘స్టార్‌లైనర్ మమ్మల్ని భూమికి చేర్చుతుందని నా మనసు చెబుతోంది’’ అని సునీత భూమి పైకి సందేశం పంపారు. ‘‘ఆమె చాలా ధైర్యంగా ఉన్నారు’’ అని సహ వ్యోమగామి విల్మోర్ ఆమె గురించి గొప్పగా చె΄్పారు.
అంతరిక్షంలో డాన్స్!
విల్మోర్ చె΄్పారనే కాదు.. సునీతా విలియమ్స్ గట్టి అమ్మాయి. భూమి మీద ఉండి మనం ఆమె గురించి భయపడుతున్నాం కానీ.. అంతరిక్షంలో ఆమె ఉల్లాసంగా గడుపుతున్నారు. నాసా వారు ఇచ్చిన వీక్ ఆఫ్‌ని చక్కగా ఎంజాయ్ చేశారు. ఇంటికి ఫోన్ చేసి మాట్లాడారు. గేమ్స్ ఆడుతున్నారు కూడా. ఇంకా.. మైక్రో గ్రావిటీలో మొక్కలు నీటిని ఎలా సంగ్రహిస్తాయో సునీత పరీక్షిస్తున్నారు.
నిజానికి రోదసీయానం సునీతా విలియమ్స్‌కి ఇదే మొదటిసారి కాదు. 2006లో, 2012లో ఐఎస్‌ఎస్‌కి వెళ్లారు. 322 రోజులు అంతరిక్షంలో గడిపారు. మొత్తం కలిపి 50 గంటల 40 నిముషాల పాటు స్పేస్ వాక్ చేశారు. ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆనందంతో ఆమె డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది కూడా. సునీతకు అంతరిక్ష యాత్ర ఇదే తొలిసారి కాకున్నా.. బోయింగ్ స్టార్ లైనర్‌తో మానవ సహిత యాత్రను నిర్వహించటం నాసాకు మొదటిసారే.
కన్నవారి కల
కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ మూలాలు కలిగిన రెండో మహిళ సునీతా విలియమ్స్. అమెరికాలోని ఒహాయో పట్టణంలో 1965లో జన్మించారు సునీత. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ. తల్లి ఉర్సులిన్ స్లొవేనియా మహిళ. సునీత ఫిజిక్స్ లో డిగ్రీ చేశారు.
ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అమెరికన్ నావికాదళంలో కొన్నాళ్లు డైవింగ్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేశారు. 1998లో రోదసీయానంలో శిక్షణ తీసుకున్నారు. వ్యోమగామి కావాలన్నది మాత్రం తల్లిదండ్రుల కల. ఆ కల నెరవేరటానికి కూడా కారణం అమ్మానాన్నే అంటారు సునీత. సునీత త్వరగా భూమిపైకి తిరిగి రావాలని ఆకాంక్షిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment