బార్బీ బొమ్మలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్. చాలా దేశాల్లో బార్బీతో ఆడుకోని అమ్మాయిలే ఉండరని చెప్పొచ్చు. ఇప్పుడా బార్బీ సరికొత్త రూపం సంతరించుకుని.. అంతరిక్షంలో చక్కర్లు కొట్టేసి వచ్చింది. వచ్చే ఏడాది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్‌ఎస్)కీ వెళ్లబోతోంది.
‘స్టెమ్’ వైపు అమ్మాయిలు..
‘సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్’ రంగాల సంక్షిప్త రూపమే ‘స్టెమ్’. ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలను స్టెమ్, స్పేస్ రీసెర్చ్ వైపు ప్రోత్సహించడం, ఆయా రంగాల్లో తమ ఆడపిల్లలను ప్రోత్సహించేలా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడం లక్ష్యంగా ‘బార్బీ ఆస్ట్రోనాట్’ను రూపొందించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ), బార్బీ బొమ్మల కంపెనీ సంయుక్తంగా ‘వుమన్ ఇన్ స్పేస్’ థీమ్‌తో ఈ ప్రాజెక్టును చేపట్టాయి. తాజాగా ఈఎస్‌ఏ నిర్వహించిన ‘వామిట్ కమెట్’ జీరో గ్రావిటీ ప్రయోగంలో బార్బీ బొమ్మకు కూడా స్థానం కల్పించారు. భార రహిత స్థితిలో తేలుతున్న బార్బీ చిత్రాలను విడుదల చేశారు.
ఆ రూపం ఎవరిదో తెలుసా..?
ఇంతకీ ‘బార్బీ ఆస్ట్రోనాట్’ రూపం ఎవరిదో తెలుసా.. ఇటలీ ఆస్ట్రోనాట్ సమంతా క్రిస్టోఫరెట్టి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్త అయిన ఆమె.. ఇంతకుముందు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో 200 రోజులు గడిపి వచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఆమె మళ్లీ ఐఎస్‌ఎస్‌కు వెళ్తున్నారు. అప్పుడు ‘బార్బీ ఆస్ట్రోనాట్’ను కూడా తన వెంట తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతానికి ఈ ‘బార్బీ ఆస్ట్రోనాట్’ బొమ్మలు యూరప్ దేశాల్లో విక్రయిస్తున్నారు. త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశముంది.
ఈ ఫొటోలో ధగధగా మెరుస్తూ వెంట్రుకల్లా ఉన్నవేమిటో తెలుసా..? అగ్ని పర్వతం నుంచి వెలువడిన గాజు పోగులు. హవాయిలో ఇటీవలే బద్దలైన కిలాయి అగ్ని పర్వతం నుంచి.. అచ్చం వెంట్రుకల్లా సన్నగా, తేలిగ్గా లేత బంగారు రంగులో ఉండే గాజు పోగులు వెలువడుతున్నాయి.
వీటిని ‘పెలెస్ హెయిర్’గా పిలుస్తారు. హవాయ్ ప్రజలు పూజించే అగ్నిపర్వతాల దేవత పేరు ‘పెలె’. బంగారు రంగులో ఉండే ఈ గాజు పోగులు ఆ దేవత వెంట్రుకలేనని స్థానికులు చెప్తారు. అందుకే వీటికి పెలెస్ హెయిర్’గా పేరుపెట్టారు.
ఎలా ఏర్పడుతాయి?
అగ్నిపర్వతం నుంచి వెలువడే లావాలో గాజు బుడగలు ఏర్పడతాయని, అవి పగిలినప్పుడు సన్నగా, వెంట్రుకల్లా ఉండే గాజు పోగులు వెలువడతాయని హవాయ్ వల్కనో అబ్జర్వేటరీ శాస్త్రవేత్త డాన్ స్వాన్సన్ తెలిపారు. తేలిగ్గా ఉండే ఈ గాజు వెంట్రుకలు గాలిలో చాలా ఎత్తువరకు వెళతాయని.. ఎగురుతూ, కొట్టుకుపోతూ విస్తరిస్తుంటాయని చెప్పారు. చూడటానికి అందంగా ఉన్నా.. ఈ గాజు పోగులు ప్రమాదకరమని తెలిపారు. ఇవి పదునుగా ఉంటాయని.. చిన్నచిన్న ముక్కలుగా మారి పీల్చేగాలిలో, తాగే నీటిలో చేరి ఇబ్బందులకు కారణమవుతాయని వెల్లడించారు. 2018లోనూ ఈ అగ్ని పర్వతం లావాను వెదజల్లిందని.. అప్పుడు కూడా ఇలాగే ‘పెలెస్ హెయిర్’ భారీగా వెలువడిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment