రష్యా తాజాగా యాంటీ శాటిలైట్ మిస్సైల్‌ను పరీక్షించడంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా బాధ్యతారహితంగా, ప్రమాదకరమైన రీతిలో వ్యవహరించినట్లు అమెరికా పేర్కొంది. ఈ యాంటీ శాటిలైట్ మిస్సైల్ పరీక్షలో భాగంగా రష్యా తన స్వంత శాటిలైట్‌లలో ఒకదానిని పేల్చివేసింది. రష్యా ఈ పరీక్ష చేయడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లోని సిబ్బందికి ప్రమాదం ఏర్పడింది అని, ఆ సిబ్బంది రక్షణ కోసం(ఐఎస్ఎస్) క్యాప్సూల్స్‌లో దాక్కోవాల్సి వచ్చినట్లు అమెరికా తెలిపింది. స్పేస్ స్టేషన్‌లో ప్రస్తుతం ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వీరిలో నలుగురు అమెరికన్లు, ఒక జర్మన్, ఇద్దరు రష్యన్లు.
ఈ రష్యన్ యాంటీ శాటిలైట్ క్షిపణి పరీక్షలో తన స్వంత శాటిలైట్‌లను పేల్చడంతో అంతరిక్షంలో 1,500కు పైగా ఉపగ్రహ శకలాలు భూనిమ్న కక్ష్య(ఎల్ఈఓ)లో తిరుగుతున్నాయి. ఈ ప్రత్యక్ష ఆరోహణ యాంటీ శాటిలైట్(డిఏ-ఏఎస్ఎటి) క్షిపణి పరీక్ష వల్ల వేలాది చిన్న ముక్కలను అంతరిక్షంలో తిరుగుతున్నాయి, వీటిని ట్రాక్ చేయడం కష్టం అని అంతరిక్ష నిపుణులు తెలుపుతున్నారు. నాసా, రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ ఈ ఉపగ్రహ శకలాలు నుంచి అంతరిక్ష కేంద్రానికి ప్రస్తుతానికి ముప్పు లేదని పేర్కొన్నప్పటికి, ఉపగ్రహంను పేల్చడంతో వెలువడిన ఎగిరిన రాతి, ధూళి కణాలు లేదా పెయింట్ చిప్స్ వంటి ట్రాక్ చేయడానికి వీలు కానీ వాటి వల్ల అంతరిక్షంలో ప్రమాదం ఏర్పడే అవకాశమ ఉన్నట్లు తెలిపారు. ఉపగ్రహ శకలాలు ప్రతి 93 నిమిషాలకు ఒకసారి ఐఎస్‌ఎస్‌ను దాటుతున్నట్లు ఖగోళ శాస్త్రవేత్త & శాటిలైట్ ట్రాకర్ జోనాథన్ మెక్ డోవెల్ తెలిపారు.
(చదవండి: హైడ్రోజన్ కారు 484 కి.మీ మైలేజీ.. గరిష్ట వేగం 353 కి.మీ)
సైన్స్ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న కొద్ది రోజులకే ఈ సంఘటన జరిగింది. అమెరికా స్పేస్ కమాండ్ సెంటర్ ఈ పరీక్షను తీవ్రంగా ఖండించింది. అన్ని దేశాల అంతరిక్ష భద్రతపట్ల రష్యా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించినట్లు పేర్కొంది. దీర్ఘకాలిక అంతరిక్ష కార్యకలాపాలకు ఇది ప్రమాదం కలిగించే అవకాశం ఉన్నట్లు యుఎస్ స్పేస్ కమాండ్ కమాండర్ జనరల్ జేమ్స్ డికిన్సన్ అన్నారు. దీనివల్ల ప్రపంచానికి పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది అని అన్నారు. 1982లో ప్రయోగించిన తన సొంత ఉపగ్రహం కాస్మోస్-1408ను రష్యా పేల్చినట్లు తెలుస్తోంది. ఈ పనిచేయని ఉపగ్రహం సుమారు 2,000 కిలోల బరువు ఉంది.
చివరిసారిగా 485 కిలోమీటర్ల ఎత్తైన కక్ష్యలో ట్రాక్ చేసినట్లు స్పేస్ న్యూస్ తెలిపింది. ఐఎస్ఎస్ భూమికి 402 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో ఉంది. రష్యా చేసిన పని వల్ల అంతర్జాతీయ అంతరిక్ష సంస్థకు ముప్పు ఉందని, చైనా స్పేస్ స్టేషన్‌కు చెందిన టైకోనాట్లకు కూడా విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆరోపిస్తోంది. అయితే ఈ ఘటన పట్ల రష్యా స్పేస్ ఏజెన్సీ స్పందించలేదు. చైనా, భారతదేశం, రష్యా, యుఎస్ వంటి నాలుగు దేశాలు మాత్రమే యాంటీ శాటిలైట్ మిస్సైల్ పరీక్షను విజయవంతంగా నిర్వహించగలిగాయి.
Comments
Please login to add a commentAdd a comment