మాస్కో: తొలిసారిగా భూకక్ష్యలో సినిమా షూటింగ్ జరగనుంది. ఇందుకోసం రష్యా నటి, సినిమా డైరెక్టర్ మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు చేరుకున్నారు. కజఖ్‌స్తాన్‌లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి ఎగిసిన సోయుజ్ అంతరిక్ష నౌక ద్వారా ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. ఈ బృందంలో నటి యులియా పెరెసిల్డ్(37), దర్శకుడు క్లిమ్ షిపెంకో(38)తోపాటు వ్యోమగామి అంటోన్ ష్కాప్లెరోవ్ ఉన్నారు.
ఇప్పటికే మూడు పర్యాయాలు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన అంటోన్ ఈ ప్రయాణానికి నాయకత్వం వహించారు. ఛాలెంజ్ అనే పేరున్న సినిమాలో నటి యులియా సర్జన్‌గా నటిస్తున్నారు. అంతరిక్ష కేంద్రంలోని ఒక సభ్యుడికి గుండెపోటు రావడంతో ఆమె అక్కడికి వెళ్లి చికిత్స అందించే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇప్పటికే ఐఎస్‌ఎస్‌లో ఉన్న నోవిట్‌స్కీ, పీటర్ డుబ్రోవ్ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో నటించనున్నారు. నోవిట్‌స్కీ గుండెపోటుకు గురైన వ్యోమగామి పాత్ర పోషించనున్నారు. ఈనెల 17వ తేదీన భూమికి చేరుకుని, సినిమాలోని మిగతా సన్నివేశాలను షూట్ చేస్తారు.
ఈ ప్రయాణం కోసం నాలుగు నెలల నుంచి కఠిన శిక్షణ పొందారు. ‘ఛాలెంజ్’ను రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ సాయంతో ప్రభుత్వ టీవీ ‘చానెల్ వన్’నిర్మిస్తోంది. సభ్యుల శిక్షణ, అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే చానెల్ వన్ విస్తృతంగా కవరేజీ అందించింది. ఈ మిషన్ రష్యా శక్తి, సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి చాటి చెబుతుందని ప్రభుత్వ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment