మాస్కోః సమాజంలో చీడపురుగుల్ని ఏరి పారేయాలంటే ఏదో అద్భుత శక్తి ఉద్భవించాల్సిందే.. అలాగే చట్టాన్నీ, పోలీసుల్నీ తప్పించుకుని తిరిగే అక్రమార్కులను అంతం చేయాలన్నా అటువంటి వారివల్లే కావాలి. అందుకే మన దర్శకులు అలాంటి పాత్రలను సృష్టించి వారిని హీరోలుగా చూపిస్తుంటారు. కానీ మాస్కోలో దుష్టశక్తులను చీల్చి చెండాడేందుకు నిజంగానే ఓ వ్యక్తి రంగంలోకి దిగాడు. చీకటి పనులకు పాల్పడే క్రిమినల్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు.
రష్యాలోని మాస్కో శివారు ప్రాంతమైన కిమ్కీలో మారువేషం ధరించి వచ్చే మనిషి.. స్థానిక నేరస్థుల పనిపడుతున్నాడు. సమాజానికి చెడు తలపెట్టే ప్రతి వ్యక్తిపై దృష్టి సారిస్తున్న 'బ్యాట్ మ్యాన్' వివరాలను తాజాగా ఓ ట్యాక్సీ డ్రైవర్ వివరించాడు. ఎక్కడ అన్యాయం, హింస, అవినీతి ఉంటుందో అక్కడ తాను ప్రత్యక్షమౌతానంటూ ఛాలెంజ్ చేస్తున్న ఆ అపరిచితుడు.. బ్యాట్ మ్యాన్ దుస్తులతో ముసుగు ధరించి వచ్చి.. నేరస్థులను చితకబాది వదిలిపెడుతున్నట్లు చెప్పాడు. గతనెల్లో జరిగిన ఇటువంటి ఘటనపై వివరాలు వెల్లడించిన ట్యాక్సీ డ్రైవర్.. ఘటనతర్వాత అక్కడకు వచ్చిన పోలీసులు.. సదరు క్రిమినల్స్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపాడు.
హీరోలా వచ్చి విలన్ల లాంటి క్రిమినల్స్ పనిపడుతున్న ఆ ముసుగు వ్యక్తిని ఇప్పుడు కిమ్కీ వాసులు 'కిమ్కీ బ్యాట్ మ్యాన్' అని పిలుస్తున్నారు. గత నెల్లో జరిగిన ఘటనలో సదరు ముసుగు వీరుడు.. అర్థరాత్రి సమయంలో ఓ భవనంలోకి ప్రవేశించి, అక్కడివారిని చితకబాది వదిలి పెట్టాడని, తర్వాత ఆ భవనం డ్రగ్ డెన్ గా తెలిసిందని ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు తెలిపిన వివరాలను బట్టి తెలుస్తోంది. దీంతో ఇప్పడా బ్యాట్ మ్యాన్ వివరాలు తెలుసుకునేందుకు ఓ రష్యా పత్రిక పరిశోధనలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సదరు వ్యక్తి పోలీసులకు ట్వీట్ చేసిన లేఖను సంపాదించింది. నేరస్థులపై వన్ మ్యాన్ ఆర్మీలా యుద్ధం చేస్తానని, మానవత్వానికి మొదటి హీరో తానేనంటూ తనను తాను అభివర్ణించుకున్న అతడు.. తన పేరు రీపర్ అంటూ ఆ లేఖలో తెలిపాడు. తన ప్రయత్నానికి పోలీసుల అండదండలు కావాలని లేఖద్వారా విన్నవించాడు. తాను చట్టానికి వ్యతిరేకం కాదని, పోలీసులు వెళ్ళలేని ప్రాంతాలకు సైతం తాను వెళ్ళి, అక్కడి నేరగాళ్ళు, డ్రగ్ మాఫియా, రేపిస్టులవంటి వారి పని పడతానని అందుకు సమాచారం ఇచ్చి సహకరించాలని పోలీసులను లేఖలో కోరాడు. తన ట్విట్టర్ పేజీ (Twitter page, @JnecReaper) ద్వారా నేరస్థుల సమాచారాన్ని తనకు కిమ్కీ వాసులెవ్వరైనా అందించవచ్చని కూడ తెలిపాడు. ఇప్పటికే నేరస్థుల విషయంలో పోలీసులకు సహకరించానని, ఎన్నో డ్రగ్ ల్యాబ్స్ ను నాశనం చేశానని లేఖలో వివరించిన అతడి ట్విట్టర్ అకౌంట్ తెరిస్తే మాత్రం 'ఇది ఆరంభం మాత్రమే' అని ఉందట.
క్రిమినల్స్ పనిపడుతున్న 'బ్యాట్ మ్యాన్'!
Published Thu, Jul 7 2016 9:39 AM | Last Updated on Sat, Aug 11 2018 8:54 PM
Advertisement
Advertisement