51.5 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్‌లో ఏర్పాటు
వ్యూహాత్మకంగా సానుకూలం: సైంటిస్టులు
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్)కు సంబంధించి కీలక ముందడుగు పడింది. దీన్ని భూ స్థిర కక్ష్యలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)తో దాదాపు సమానంగా 51.5 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ (కక్ష్య తాలూకు వంపు కోణం)లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యోమ నౌకల ప్రయోగం తదితరాల్లో ఆర్బిటల్ ఇంక్లినేషన్ (ఓఐ)ది చాలా కీలక పాత్ర.
51.5 డిగ్రీల ఓఐ వల్ల అంతరిక్షం నుంచి భూమిని సమగ్రంగా పర్యవేక్షించేందుకు అవకాశముంటుంది. ఈ కోణంలో అంతరిక్ష కేంద్రం భూమిపై దాదాపు 90 శాతానికి పైగా జనావాసాలనూ కవర్ చేస్తూ పరిభ్రమిస్తుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అంతరిక్ష పరిశోధన కేంద్రాలతోనూ అనుసంధానం సులభతరం అవుతుంది. అందుకే ఇస్రో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.
ఐఎస్‌ఎస్ కక్ష్యే ఎందుకు?
ఐఎస్‌ఎస్ భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో స్థిర కక్ష్యకు 51.6 డిగ్రీల వంపు కోణంలో పరిభ్రమిస్తుంది. బీఏఎస్ కోసం ఇస్రో దాదాపు అదే కోణాన్ని ఎంచుకోవడం దూరదృష్టితో కూడిన నిర్ణయమని చెబుతున్నారు. ఈ కోణంలో భూమిని అత్యంత విస్తృతంగా కవర్ చేయడం సులువవుతుంది. అంతేగాక ఐఎస్‌ఎస్ 2030 నాటికి పూర్తిగా తెరమరుగు కానుంది.
తద్వారా అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలకు సంబంధించి ఏర్పడే శూన్యాన్ని బీఏఎస్ భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. దీనికి తోడు వ్యోమనౌకలు అంతరిక్ష కేంద్రానికి సులువుగా అనుసంధానమయేందుకు ఈ కోణం వీలు కలి్పస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘తద్వారా ఇంధన వాడకం తగ్గడమే గాక పనితీరుకు సంబంధించిన అనేకానేక సంక్లిష్టతలు తప్పుతాయి.
దీనికి తోడు ఐఎస్‌ఎస్‌తో కమ్యూనికేషన్, ట్రాకింగ్ కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలన్నింటినీ ఇస్రో యథాతథంగా వాడుకోగలుగుతుంది. కనుక మనకు వ్యయ ప్రయాసలు కూడా బాగా తగ్గిపోతాయి’’ అని ఇస్రో మాజీ ఇంజనీర్ మనీశ్ పురోహిత్ వివరించారు. అయితే బీఏఎస్ ఏర్పాటులో కీలకమైన 51.6 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్‌ను సాధించడం సవాలే కానుందని ఆయన అభిప్రాయపడ్డారు.
బీఏఎస్ కొన్ని విశేషాలు...
→ భారతీయ అంతరిక్ష స్టేషన్ అంతరిక్షంలో మన సొంత పరిశోధన కేంద్రం
→ ఐఎస్‌ఎస్ మాదిరిగానే ఇది కూడా భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పాటు కానుంది
→ బీఏఎస్ ప్రస్తుతం డిజైన్ దశలో ఉంది
→ దీన్ని 2035కల్లా పూర్తిస్థాయిలో నిర్మించాలన్నది లక్ష్యం
→ బీఏఎస్ నమూనాను 2029 కల్లా ప్రయోగాత్మకంగా పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment