పీఎస్ఎల్వీ సక్సెస్
భూస్థిర కక్ష్యలో చేరిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్ ఉపగ్రహం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్ ఉపగ్రహాన్ని గురువారం కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి ఇస్రో 33వ సారి విజయబావుటా ఎగురవేసింది. ఇస్రో స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహాల శ్రేణిలో 1,425 కిలోల ఈ ఉపగ్రహాన్ని 20.2 నిమిషాలకు పెరిజీ (భూమికి దగ్గరగా) 284 కిలోమీటర్లు, అపోజి (భూమికి దూరంగా) 20,657 కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర బదిలీ కక్ష్యలో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనికి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) గురువారం వేదికైంది.
దిగ్విజయంగా కక్ష్యలోకి..
మంగళవారం ఉదయం 9.30కి ప్రారంభమైన కౌంట్‌డౌన్ 54.30 గంటల పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. కౌంట్‌డౌన్ ముగిశాక టెన్ టు వన్ అంకెలు చెబుతూ జీరో అనగానే సాయంత్రం 4.01 గంటలకు రాకెట్ ఎరుపు నారింజ రంగు మంటలు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. ఇక ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాల శ్రేణిలో ఒక ప్రయోగం మాత్రమే మిగిలి వుందని ఆయన అన్నారు.
ప్రయోగం జరిగింది ఇలా..
44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ సీ32 రాకెట్‌ను ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో4 దశలతో ప్రయోగించారు. ప్రయోగం ప్రారంభమైన సమయం నుంచి ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనం, కోర్‌అలోన్ దశలో నింపిన 138.2 టన్నుల ఇంధనంతో 108.6 సెకన్లకు మొదటిదశను, 42 టన్నుల ద్రవ ఇంధనంతో 259.8 సెకన్లకు రెండోదశ, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 655.3 సెకన్లకు మూడోదశ, 2.5 టన్నుల ఇంధనంతో 1,175.3 సెకన్లకు నాలుగోదశను పూర్తిచేశారు.
సొంత వ్యవస్థ కోసం
దేశీయ అవసరాల కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థకు 2006లో శ్రీకారం చుట్టి 2013 జూలైలో తొలిఉపగ్రహం (ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏ)ను పీఎస్ఎల్వీ సీ22 రాకెట్ ద్వారా నింగిలోకి పంపారు. 2014 ఏప్రిల్‌లో ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ, అక్టోబర్‌లో ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ, 2015లో ఐఆర్ఎన్ఎస్ఎస్-1డీ, 2016 జనవరిలో ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఈ, గురువారం ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్‌తోపాటు ఇప్పటికి ఆరు ఉపగ్రహ ప్రయోగాలను పూర్తి చేశారు.
ప్రధాని మోదీ అభినందన
ప్రయోగం విజయవంతమవడంపై రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. మన శాస్త్రవేత్తల విశేష కృషికి సెల్యూట్ అంటూ మోదీ ట్వీట్ చేశారు.
ఇస్రోకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: పీఎస్ఎల్వీ-సీ32 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంతో దేశం అంతరిక్ష రంగంలో మరింత దూసుకెళ్లిందని, భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని జగన్ ఆకాంక్షించారు.