Earth Observation
-
మన అంతరిక్ష కేంద్రంపై... ఇస్రో కీలక నిర్ణయం
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్)కు సంబంధించి కీలక ముందడుగు పడింది. దీన్ని భూ స్థిర కక్ష్యలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో దాదాపు సమానంగా 51.5 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ (కక్ష్య తాలూకు వంపు కోణం)లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యోమ నౌకల ప్రయోగం తదితరాల్లో ఆర్బిటల్ ఇంక్లినేషన్ (ఓఐ)ది చాలా కీలక పాత్ర. 51.5 డిగ్రీల ఓఐ వల్ల అంతరిక్షం నుంచి భూమిని సమగ్రంగా పర్యవేక్షించేందుకు అవకాశముంటుంది. ఈ కోణంలో అంతరిక్ష కేంద్రం భూమిపై దాదాపు 90 శాతానికి పైగా జనావాసాలనూ కవర్ చేస్తూ పరిభ్రమిస్తుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అంతరిక్ష పరిశోధన కేంద్రాలతోనూ అనుసంధానం సులభతరం అవుతుంది. అందుకే ఇస్రో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఐఎస్ఎస్ కక్ష్యే ఎందుకు? ఐఎస్ఎస్ భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో స్థిర కక్ష్యకు 51.6 డిగ్రీల వంపు కోణంలో పరిభ్రమిస్తుంది. బీఏఎస్ కోసం ఇస్రో దాదాపు అదే కోణాన్ని ఎంచుకోవడం దూరదృష్టితో కూడిన నిర్ణయమని చెబుతున్నారు. ఈ కోణంలో భూమిని అత్యంత విస్తృతంగా కవర్ చేయడం సులువవుతుంది. అంతేగాక ఐఎస్ఎస్ 2030 నాటికి పూర్తిగా తెరమరుగు కానుంది. తద్వారా అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలకు సంబంధించి ఏర్పడే శూన్యాన్ని బీఏఎస్ భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. దీనికి తోడు వ్యోమనౌకలు అంతరిక్ష కేంద్రానికి సులువుగా అనుసంధానమయేందుకు ఈ కోణం వీలు కలి్పస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘తద్వారా ఇంధన వాడకం తగ్గడమే గాక పనితీరుకు సంబంధించిన అనేకానేక సంక్లిష్టతలు తప్పుతాయి. దీనికి తోడు ఐఎస్ఎస్తో కమ్యూనికేషన్, ట్రాకింగ్ కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలన్నింటినీ ఇస్రో యథాతథంగా వాడుకోగలుగుతుంది. కనుక మనకు వ్యయ ప్రయాసలు కూడా బాగా తగ్గిపోతాయి’’ అని ఇస్రో మాజీ ఇంజనీర్ మనీశ్ పురోహిత్ వివరించారు. అయితే బీఏఎస్ ఏర్పాటులో కీలకమైన 51.6 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ను సాధించడం సవాలే కానుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీఏఎస్ కొన్ని విశేషాలు... → భారతీయ అంతరిక్ష స్టేషన్ అంతరిక్షంలో మన సొంత పరిశోధన కేంద్రం → ఐఎస్ఎస్ మాదిరిగానే ఇది కూడా భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పాటు కానుంది → బీఏఎస్ ప్రస్తుతం డిజైన్ దశలో ఉంది → దీన్ని 2035కల్లా పూర్తిస్థాయిలో నిర్మించాలన్నది లక్ష్యం → బీఏఎస్ నమూనాను 2029 కల్లా ప్రయోగాత్మకంగా పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
భూమి గుండ్రంగా కాదు.. దీర్ఘవృత్తంగా ఉండును!
భూమి గుండ్రంగా ఉండును. ఇది చిన్నప్పటి నుంచీ మనమంతా వింటున్నదే. నిజానికి పూర్తిగా గుండ్రంగా కాకుండా ఓ మాదిరి దీర్ఘవృత్తాకారంలో ఉందట. అసలు ఆ మాటకొస్తే భూమి ఇంకా పూర్తి రూపాన్ని సంతరించుకునే క్రమంలోనే ఉందట. దీర్ఘవృత్తాకారం రావడానికి కారణమైన గురుత్వాకర్షణ శక్తే భూమికి ఓ నిశ్చిత రూపాన్నిచ్చే పనిలో మునిగి ఉందని సైంటిస్టులు చెబుతుండటం విశేషం! భూమిపై నుంచి అంతరిక్షంలోకి జారిపోకుండా మనల్ని కాపాడుతున్నది, భూమిపై పట్టి ఉంచుతున్నది గురుత్వాకర్షణ శక్తేనన్నది తెలిసిందే. భూమికి ఉన్న ఆ శక్తే భూమిని లోలోపలి నుంచి సమ్మెట పోట్లను తలపించేలా ఒత్తిడి చేసీ చేసీ దీర్ఘవృత్తాకారానికి తీసుకొచ్చిందట. భూమి కేంద్రానికి, ఉపరితలానికి మధ్య దూరం భూమధ్యరేఖ వద్ద ఒకలా, ధ్రువాల వద్ద ఇంకోలా ఉండటానికి ఈ దీర్ఘవృత్తాకారమే కారణమట. భూమి రూపాన్ని తీర్చిదిద్దే ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందని తాజాగా కనిపెట్టామంటున్నారు అంతరిక్ష శాస్త్రవేత్తలు. భూమి ఆకారాన్ని నిర్దేశించడంలో గురుత్వాకర్షణ శక్తితో పాటు ఎగుడుదిగుడు ఉపరితలం, లోపలి పొరల్లో ఉన్న వనరుల అసమతుల విస్తృత వంటి పలు ఇతర కారకాల ప్రమేయమూ ఉందని పరిశోధన తేల్చింది. ఒకప్పుడు భూమిపై 30 కిలోమీటర్ల పైచిలుకు ఎత్తు దాకా ఉన్న పర్వతాలు గురుత్వాకర్షణ శక్తి వల్లే క్రమంగా తగ్గుతూ వచ్చాయట. భూమిపై ఉన్న విభిన్న స్థలాకృతులు, పై పొరల కదలికలు తదితరాలు కూడా ఇందుకు కారణమయ్యాయని తేలింది. భూమి ఎలా ఏర్పడిందో అర్థం చేసుకునే ప్రయత్నానికి ఈ తాజా ఆవిష్కరణలు కొత్త కోణాలను అందిస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇదీ చదవండి: IPCC: వాతావరణ మార్పులతో దేశాలన్నీ అతలాకుతలం -
థర్మల్ ప్లాంట్ కోసం పోలాకిలో భూ పరిశీలన
పోలాకి: జిల్లాలో థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా జపాన్‌కు చెందిన సుమితొమొ సంస్థ ప్రతినిధులు జిల్లాలోని పలు ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. పోలాకిలోని తోటాడ గ్రామం వద్ద ప్రతిపాదిత స్థలాన్ని బుధవారం పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా జెన్కో అధికారులు తోటాడ గ్రామానికి చేరుకుని భూముల వివరాలపై ఆరా తీశారు. ఇక్కడ నుంచి రైల్వేస్టేషన్, సముద్రతీరం, జాతీయ రహదారికి గల దూరాలను అంచనా వేశారు. భూముల పరిశీలనకు వచ్చిన వారిలో ఏపీ జెన్కో సంస్థ ఈఈ కె.సూర్యనారాయణ, కన్సల్టెన్సీ ప్రతినిధి ఎం.మనోహర్, తహశీల్దార్ జె.రామారావు, ఆర్ఐలు అనిల్‌కుమార్, బాలకృష్ణ, మండల సర్వేయర్లు ఉన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో మండల సలహాదారు తమ్మినేని భూషణరావుతో సదరు అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జెన్కో ఈఈ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇక్కడ ప్లాంట్ నిర్మాణానికి అనుకూలతలను జాపాన్ బృందం పరిశీలించనుందన్నారు. ఇది ప్రాథమిక పరిశీలన మాత్రమేనని, సాంకేతిక నిపుణుల పరిశీలన మేరకు అనుకూలమైతే తుదినిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అధికారులు గుర్తించిన భూములు వివరాలు ఇవే.. మండలలోని గత వారం రోజులుగా ప్లాంట్ కోసం రెవెన్యూ అధికారులు కసరత్తు చేసి తోటాడ పరిసర గ్రామాల్లో 2227.620 ఎకరాల భూములు గుర్తించారు. ఇందులో 1050 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా మిగిలినది అక్కడి రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఈ భూములు చీడివలసలో472 ఎకరాలు, యాట్లబసివలస-138, కొండలక్కివలస-407, ఓదిపాడు-605, కుసుమపోలవలస-25, ధీర్ఘాశి-204, తోటాడ-336, చెల్లాయివలస గ్రామ పరిధిలో 338 ఎకరాలు ఉన్నట్టు గుర్తించారు.