సునీత వచ్చేస్తోంది.. ఐఎస్‌ఎస్‌తో క్రూ-10 అనుసంధానం సక్సెస్‌ | Spacex Crew 10 Successfully Docks With International Space Station | Sakshi
Sakshi News home page

సునీత వచ్చేస్తోంది.. ఐఎస్‌ఎస్‌తో క్రూ-10 అనుసంధానం సక్సెస్‌

Published Sun, Mar 16 2025 12:17 PM | Last Updated on Sun, Mar 16 2025 12:48 PM

Spacex Crew 10 Successfully Docks With International Space Station

అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. నాసా-స్పేస్‌ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్‌ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం విజయవంతమైంది. ఇవాళ (ఆదివారం) ఉదయం 9:40 గంటలకు ఈ అనుసంధాన ప్రక్రియ జరిగినట్లు వెల్లడించిన నాసా.. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది.

నాసా-స్పేస్‌ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఫాల్కన్‌ 9 రాకెట్‌ డ్రాగన్‌ క్యాప్సుల్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.

ఈ ప్రయోగం ద్వారా నలుగురు వ్యోమగాములు మెక్‌ క్లెయిన్‌, నికోల్‌ అయర్స్‌, టకుయా ఒనిషి, కిరిల్‌ పెస్కోవ్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ నలుగురు వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌ స్థానంలో పనిచేయనున్నారు.

సునీతా విలియమ్స్‌ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులైంది! 2024 జూన్‌ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్‌ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు! భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్‌.ఎస్‌.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్‌ స్టార్‌లైనర్‌’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది!

‘నాసా’ టీమ్‌ భూమి మీద నుంచి స్టార్‌లైనర్‌కు చేసిన మరమ్మత్తులు ఫలితాన్నివ్వలేదు. ఏమైతేనేం, వారం రోజుల పనికి వెళ్లి, నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్‌ భూమి పైకి తిరిగొచ్చే తేదీ ఖరారైంది. అందుకోసం ఎలాన్‌ మస్క్‌ సంస్థ ‘స్పేస్‌ఎక్స్‌’ దగ్గర రన్నింగ్‌లో ఉన్న ‘క్రూ–10’ అనే వ్యోమ నౌకను సిద్ధం చేశారు. క్రూ-10 మిషన్‌ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం విజయవంతమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement