కేప్ కెనవెరల్ (అమెరికా): హమ్మయ్యా... సునీతా విలియమ్స్ త్వరలోనే భూమిని చేరుకోనున్నారు. భూమికి సుమారు 300 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో చిక్కుకుపోయిన ఈ భారతీయ సంతతి అమెరికన్ వ్యోమగామిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇంకో రెండు రోజుల్లోనే (సెప్టెంబరు 26వ తేదీ) దీనికి సంబంధించిన ప్రయోగం ఉంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలిపింది. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ - రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కేప్ కెనవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి గురువారం ప్రయోగించనున్నామని నాసా ప్రకటించింది. అన్నీ సవ్యంగా సాగితే సునీత, బుచ్ విల్మోర్‌లతోపాటు అమెరికా, రష్యాకు చెందిన మరో ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భూమ్మీదకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.
బోయింగ్ స్టార్‌లైనర్ -12 ద్వారా ఈ ఏడాది జూన్‌లో సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వారి తిరుగు ప్రయాణం మాత్రం అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. స్టార్‌లైనర్‌లోని 24 థ్రస్టర్లలో ఐదు పనిచేయకుండా పోయాయి. అలాగే ప్రొపల్షన్ వ్యవస్థలో హీలియం లీక్ అయినట్లు స్పష్టమైంది. ఐఎస్‌ఎస్ నుంచే ఈ సమస్యలను పరిష్కరించేందుకు సునీత, విల్మోర్లు, గ్రౌండ్‌స్టేషన్ నుంచి నాసా అన్ని రకాల ప్రయత్నాలు చేశాయి. అయినప్పటికీ ఈ స్టార్‌లైనర్ సురక్షితంగా భూ వాతావరణంలోకి ప్రవేశించలేదని, ల్యాండింగ్‌ను నియంత్రించడమూ కష్టమని తేలిన నేపథ్యంలో ఖాళీగానే వెనక్కు రప్పించాలని నాసా నిర్ణయించింది. దీంతో సునీత, విల్మోర్లు నాలుగు నెలలపాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
కొసమెరుపు ఏమిటంటే.. ఈ నెల 26 నాటి ప్రయోగం కూడా కచ్చితంగా జరుగుతుందని చెప్పలేము. ఫ్లారిడాకు సమీపంలోని మెక్సికో జలసంధి వద్ద ఏర్పడ్డ ‘నైన్’ తుపాను ప్రయోగ కేంద్రం కేప్ కెనవెరాల్ వైపు దూసుకు వస్తూంది ఫలితంగా అనానుకూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రయోగం వాయిదా పడే సూచనలు ఉన్నాయి.
భూమికి సురక్షితంగా చేరుకున్న ముగ్గురు
మాస్కో: ఇద్దరు రష్యన్, ఒక అమెరికన్ వ్యోమగాములతో కూడిన సోయుజ్ క్యాప్సూల్ ఐఎస్‌ఎస్ నుంచి కజకిస్తాన్‌కు చేరుకుంది. ఐఎస్‌ఎస్ నుంచి సోమవారం విడివడిన క్యాప్సూల్ మూడున్నర గంటల తరువాత కజకిస్తాన్‌లోని పచ్చిక మైదానంలో దిగింది. సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా క్యాప్సూల్‌లోని రెండు థ్రస్టర్లను కొద్దిసేపు మండించారు. ఆఖరు దశలో 7.2 మీటర్ల పారాచూట్ విచ్చుకుని క్యాప్సూల్ సురక్షితంగా గంటకు 16 మైళ్ల వేగంతో కిందికి వచ్చింది.
చదవండి: ట్రంప్ నోట ఓటమి మాట.. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే..
అనంతరం అందులోని వ్యోమగాములను బయటకు తీసుకువచ్చి, వైద్య పరీక్షలు జరిపారు. ఈ వ్యోమగాములు ఒలెగ్ కొనొనెంకో, నికొలాయ్ చుబ్‌లు 374 రోజులపాటు ఐఎస్‌ఎస్‌లో గడిపారు. ఇది ప్రపంచ రికార్డని అధికారులు తెలిపారు. వీరితోపాటే వచ్చిన అమెరికన్ వ్యోమగామి ట్రేసీ డైసన్ ఆరు నెలలపాటు ఐఎస్‌ఎస్‌లో ఉన్నారు. కాగా, ఐఎస్‌ఎస్‌లో సునీతా, విల్మోర్ సహా ఇంకా 8 మంది వ్యోమగాములున్నారు.
Comments
Please login to add a commentAdd a comment