ఫ్లోరిడా : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన స్పేస్ ఎక్స్ ప్రయోగం వాయిదా పడింది. తొమ్మిదేళ్ల తర్వాత అమెరికా గడ్డపై నుంచి వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) తీసుకెళ్లడానికి ఉద్దేశించిన ఈ మిషన్ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు వాయిదా పడినట్టు నాసా వెల్లడించింది. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాసా తెలిపింది. అన్ని అనుకూలిస్తే స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.22 గంటలకు గానీ, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్పేస్ ఎక్స్‌ను నింగిలోకి పంపనున్నారు.
ఓ వైపు 2011 తర్వాత యూఎస్ నుంచి వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లడం, మరోవైపు తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ(స్పేస్ ఎక్స్) అభివృద్ధి చేసిన రాకెట్ కావడంతో ఈ ప్రయోగం నాసాకు ప్రతిష్టాత్మకంగా మారింది. కాగా, స్పేస్ ఎక్స్ రూపొందించిన ఈ ఫాల్కన్ రాకెట్ ద్వారా డగ్లస్ హర్లీ, రాబర్ట్ బెంకెన్ అంతరిక్షంలోకి వెళ్లేందుకు అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం సాయంత్రం 4.33 గంటలకు రాకెట్ నింగిలోకి వెళ్లడానికి కౌంట్‌డౌన్ స్టార్ అయింది. ప్రయోగ సమయానికి రెండు గంటల ముందే హర్లీ, బెంకెన్‌లు తమ సీట్లలో కూర్చున్నారు. అయితే ప్రయోగానికి సరిగ్గా 16 నిమిషాల ముందు వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు స్పేస్ ఎక్స్ లాంచ్ డైరెక్టర్ మైక్ టేలర్ వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని వీక్షించడానికి ఫ్లోరిడా స్పేస్ కోర్డు వద్దకు భారీగా జనాలు చేరుకున్నారు. అయితే ప్రయోగం వాయిదా పడటంతో వారు కాసింత నిరాశ చెందారు.
Comments
Please login to add a commentAdd a comment