వాషింగ్టన్: శత్రుదేశాల ఉపగ్రహాలు కూల్చేసేందుకు ఇటీవల భారత్ చేపట్టిన శాటిలైట్ విధ్వంసక క్షిపణి (ఏశాట్) పరీక్ష వల్ల అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికే (ఐఎస్‌ఎస్) ముప్పు వాటిల్లనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హెచ్చరించింది. ఆ ప్రయోగం వల్ల అంతరిక్షంలో దాదాపు 400 వ్యర్థ శకలాలు పోగుపడ్డాయని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్‌స్టిన్ తెలిపారు. దీంతో ఐఎస్‌ఎస్‌ను వ్యర్థాలు ఢీకొనే ప్రమాదం 44 శాతం పెరిగిందన్నారు.
కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాలను కూల్చేయగల చరిత్రాత్మక ‘మిషన్ శక్తి’ని విజయవంతంగా భారత్ ప్రయోగించినట్లు ప్రధాని మోదీ మార్చి 27న వెల్లడించడం తెల్సిందే. 60 వ్యర్థ శకలాలను గుర్తించామని, అందులో 24 ఐఎస్‌ఎస్‌కు అతి దగ్గరలో ఉన్నాయని బ్రైడెన్‌స్టిన్ చెప్పారు. ‘అంతరిక్షంలోకి వ్యర్థాలను పంపడం చాలా ఘోరమైన చర్య. అది కూడా అంతరిక్ష పరిశోధన కేంద్రానికి దగ్గరగా పంపడం దారుణం. భవిష్యత్తులో మానవులు అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టే ఉపగ్రహ ప్రయోగాలకు ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తాయి’అని చెప్పారు.
మిషన్ శక్తిలో భాగంగా భారత్ తన ప్రయోగాన్ని వాతావరణ దిగువ పొరల్లోనే చేయడం వల్ల శకలాలు కొన్ని వారాల వ్యవధిలోనే వాతావరణంలోకి ప్రవేశించి మండిపోతాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసినా అలా జరగలేదని ఆయన పేర్కొన్నారు. భారత్ ఏశాట్ పరీక్షకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయం నుంచి మాట్లాడిన తొలి వ్యక్తి బ్రైడెన్‌స్టిన్ కావడం గమనార్హం. శకలాల వల్ల ఐఎస్‌ఎస్‌కు ముప్పు పొంచి ఉందనే విషయాన్ని నాసా నిపుణులు, జాయింట్ స్పేస్ ఆపరేషన్స్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు చెప్పినట్లు బ్రైడెన్‌స్టిన్ తెలిపారు. 2007లో చైనా ఇలాంటి ప్రయోగమే చేపట్టడం వల్ల పోగుపడ్డ శకలాలు ఇంకా అంతరిక్షంలోనే ఉన్నాయని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment