వాషింగ్టన్: రోదసీలో మానవ మూలకణాలు ఎలా అభివృద్ధి చెందుతాయో తెలుసుకునేందుకుగాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ప్రయోగం చేపట్టనున్నట్లు ఫ్లోరిడాలోని మయో క్లినిక్, సెల్ థెరపీ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మనిషి ఎముక మజ్జలోని మూలకణాలు భూమి మీద కన్నా అంతరిక్షంలో వేగంగా పెరుగుతాయా? అన్న కోణంలో ఈ పరిశోధన చేపట్టేందుకుగాను తమకు 3 లక్షల డాలర్ల నిధులు అందాయని శాస్త్రవేత్త అబ్బా జుబైర్ తెలిపారు. అంతరిక్షంలో మూలకణాలను వేగంగా అభివృద్ధిపర్చడం, వాటితో కణజాలాలు, అవయవాలను త్వరగా పెంచడమూ సాధ్యం అయితే గనక.. పక్షవాతం, వెన్నెముక గాయాలు, ఇతర అనేక సమస్యలు ఎదుర్కొనే రోగులకు అత్యంత త్వరగా, సమర్థంగా మూలకణ చికిత్స చేసేందుకు వీలవుతుందన్నారు.