Mayo Clinic
-
మీకు హార్ట్ ఎటాక్ వచ్చింది చూసుకోండి!
మనిషి రోజు వారీ జీవితంలో టెక్నాలజీ భాగమైపోయింది. దాని వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. అయితే, అది మనం ఉపయోగించుకునే తీరుపై ఆధారపడి ఉంటుంది. సక్రమంగా ఉపయోగిస్తే అది మనిషి ప్రాణాలను సైతం కాపాడుతుందనడానికి స్మార్ట్ వాచ్‌లు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌గా యాపిల్ అరుదైన ఘనత సాధించింది. సాధారణంగా గుండె ఎడమ జఠరిక పనిచేయకపోవడం వల్ల హృద్రోగ (గుండె సంబంధిత) సమస్యలు తలెత్తుతుంటాయి. కానీ వాటిని గుర్తించడంలోనే అలస్యం ఏర్పడి కొన్ని సార్లు గుండె పోటు వస్తుంది.సరైన సమయంలో ట్రీట్మెంట్ అందకపోవడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఆ తరహా సమస్యలతో బాధపడే వారిని గుర్తించి యాపిల్ వాచ్ అలెర్ట్ ఇస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. మాయో క్లినిక్ రీసెర్చ్ ప్రకారం..అమెరికాతో పాటు 11 ఇతర దేశాలకు చెందిన 2,454 మంది హృద్రోగులపై ఆగస్టు 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు పరిశోధనల్లో జరిగాయి. ఇందులో భాగంగా సైంటిస్టులు అభివృద్ధి చేసిన ఏఐ అల్గారిదంతో యాపిల్ వాచ్ ద్వారా 1,25,000 ఈసీజీ (Electrocardiography) టెస్ట్‌లను చేయగా సత్ఫలితాలు నమోదైనట్లు రీసెర్చర్లు తెలిపారు. సరైన వైద్య సదుపాయాలు లేని ప్రదేశాల్లో ఈసీజీ టెస్ట్‌లతో యాపిల్ వాచ్ గుండె సంబంధిత బాధితుల్ని గుర్తిస్తాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం పరిశోధనలు ప్రారంభ దశలో ఉన్నాయని, భవిష్యత్‌లో యాపిల్ వాచ్ ద్వారా హార్ట్ ఎటాక్‌తో పాటు ఇతర గుండె సంబంధిత సమస్యలు గుర్తించి యాపిల్ స్మార్ట్ వాచ్‌లు మనుషుల ప్రాణాలు కాపాడేలా వైద్య చరిత్రలో అరుదైన అద్భుతాలు జరుగుతాయని మాయో రీసెర్చర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉150 అడుగుల లోయలో చావు బతుకుల్లో బాలుడు..‘యాపిల్ వాచ్ నా ప్రాణం కాపాడింది సార్’ -
మేయో క్లినిక్‌తో ఏఐజీ ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ధరల్లో భారతీయులకు అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికాలోని మేయో క్లినిక్‌తో ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ(ఏఐజీ) ఒప్పందం కుదుర్చుకుంది. మేయో క్లినిక్ కేర్ నెట్‌వర్క్‌లో భాగమైన తొలి భారతీయ ఆస్పత్రి ఏఐజీనే అని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాజా ఒప్పందంతో సంక్లిష్టమైన కేసులకు సంబంధించి రెండో అభిప్రాయం తీసుకోవడం మొదలుకొని.. పలు అంశాల్లో మేయో క్లినిక్ పరిశోధనల వివరాలు ఏఐజీకి అందుబాటులోకి వస్తాయని అన్నారు. అయితే దీని వల్ల రోగులపై అదనపు భారమేదీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. సుమారు 155 ఏళ్లుగా వైద్య రంగంలో లాభాపేక్ష లేకుండా సేవలందిస్తున్న మేయో క్లినిక్‌లో 5 వేల మంది నిపుణులైన వైద్యులు ఉన్నారని చెప్పారు. దీంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో 9 ఆస్పత్రులున్న మేయో నెట్వర్క్ అనుభవాలను కూడా ఉపయోగించుకుంటామని అన్నారు. వైద్యంతోపాటు పరిశోధన రంగంలోనూ ఇరు సంస్థలు కలసి పనిచేస్తాయని తెలిపారు. కాలేయ మూలకణ పరిశోధనల్లో ఏఐజీకి ఎంతో ప్రావీణ్యముంటే.. గుండె మూలకణాలపై మేయో క్లినిక్ ఎన్నో పరిశోధనలు చేపట్టిందన్నారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు సంస్థలు ఈ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే పరిస్థితి కలగనుందని చెప్పారు. ఆరోగ్యం, వ్యాధుల విషయం లో శరీరంలోని సూక్ష్మజీవావరణం కీలకపాత్ర పోషిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్న నేపథ్యం లో ఏఐజీ వీటిపై కూడా పరిశోధనలు చేపట్టిందని తెలిపారు. కాలేయ సంబంధిత సమస్యలు ఉన్న వారిలో కొందరికి మధుమేహం ఉంటూ.. ఇంకొందరికి లేకపోవడం వెనుక బ్యాక్టీరియా వైవిధ్యతలో ఉన్న తేడాలే కారణమని తాము గుర్తించామని చెప్పారు. మేయో క్లినిక్ కేర్ నెట్వర్క్ డైరెక్టర్, ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ హేస్ మాట్లాడుతూ.. అందరికీ మెరుగైన వైద్యం అందించే ఏకైక లక్ష్యంతో ఈ నెట్వర్క్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. మేయో క్లినిక్ పేరును మార్కెటింగ్‌కు వాడుకునే ఏ సంస్థకూ నెట్‌వర్క్‌లో భాగస్వామ్యం కల్పించబోమని తెలిపారు. మూల కణాలపై పరిశోధనలు ఏఐజీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి మాత్రమే కాకుండా.. అత్యున్నత ప్రమాణాలతో పరిశోధనలు చేసే సంస్థ కూడా అని నాగేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో మూలకణాలపై విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ఎముక మజ్జ నుంచి సేకరించిన మూలకణాలను ఇతర అవయవాలకు సంబంధించిన కణాలుగా మార్చి ఎన్నో సత్ఫలితాలు సాధించామని వివరించారు. ఈ నేపథ్యంలో పేగుల్లోకి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను జొప్పించేందుకు కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. -
మీరు బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా?
లండన్ : రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే వారు స్లిమ్‌గా ఉండటంతో పాటు మున్ముందు బరువు పెరగకుండా ఉంటారని తాజా అథ్యయనం వెల్లడించింది. కేలరీలను తగ్గించుకునేందుకు, నాజూకుగా ఉండేందుకు పలువురు అల్పాహారం తీసుకోవడాన్ని విస్మరిస్తుంటారని, ఇది సరైంది కాదని మయో క్లినిక్ నిర్వహించిన అథ్యయనం పేర్కొంది. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే 350 మందిని పరిశీలించగా వారి నడుము భాగం సాధారణంగా ఉన్నట్టు గుర్తించామని, పదేళ్ల తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తీసుకోనివారు ఎనిమిది పౌండ్లు పెరిగారని తెలిపింది. రోజూ ఉదయాన్నే అల్పాహారం తీసుకున్నవారు పదేళ్లలో కేవలం మూడు పౌండ్ల బరువు మాత్రమే పెరిగారని పరిశోధకులు వెల్లడించారు. బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకోనివారు సరైన మోతాదులో సమతుల ఆహారాన్ని పొందలేకపోవడం వల్లే వారిలో కొవ్వు పేరుకుపోతున్నట్టు తేలింది. బ్రేక్‌ఫాస్ట్‌ను తరచూ తీసుకోనివారితో పోలిస్తే నిత్యం బ్రేక్‌ఫాస్ట్ తీసుకునేవారు ఆరోగ్యంగా ఉన్నారని తమ పరిశోధనలో వెల్లడైందని మయో క్లినిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వీరెంద్ సోమర్స్ చెప్పారు. అల్పాహారం తీసుకోని వారిలో పొట్టభాగంలో కొవ్వు పేరుకుపోవడం ఆందోళనకరమని అన్నారు. ఈ కొవ్వు టాక్సిన్లను విడుదల చేయడం ద్వారా రక్త నాళాలకు విఘాతం కలుగుతుందన్నారు. తాజా పండ్లు, ధాన్యాలు, గింజలతో కూడిన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలని సూచించారు. -
గర్భ సంచి తొలగింపుతో..
మహిళలల్లో గర్భ సంచి తొలగింపు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోందని మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం మరోసారి స్పష్టం చేసింది. మెనోపాజ్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయన వివరాల ప్రకారం... రెండు అండాశయాలను అలాగే ఉంచి... గర్భాశయాన్ని మాత్రమే తొలగించిన సందర్భాల్లోనూ మహిళలకు గుండె జబ్బులు మొదలుకొని జీవక్రియ సంబంధిత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తప్పడం లేదు. ఇప్పటివరకూ అండాశయాల తొలగింపుతోనే సమస్యలన్న అంచనా ఉండేదని, తాజా అధ్యయనం అది తప్పని చెబుతోందని షానన్ లాగ్లిన్ టొమ్మాసో అనే శాస్త్రవేత్త తెలిపారు. మహిళల వయసు 35 ఏళ్ల కంటే తక్కువ ఉంటే వారికి ఈ సమస్యలు మరింత ఎక్కువ ఇబ్బందిపెట్టే అవకాశముందని తెలిపారు. 1980 –2002 మధ్యకాలంలో అండాశయాలను ఉంచి, గర్భాశయం మాత్రమే తొలగించిన రెండు వేల మంది మహిళల వివరాలను... రెండింటినీ తొలగించిన వారితో పోల్చి చూడటం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని వివరించారు. గర్భాశయం మాత్రమే తొలగించిన వారిలో 14 శాతం మందికి కొలెస్ట్రాల్ సమస్యలు ఎదురుకాగా, 13 శాతం మంది అధిక రక్తపోటు, 18 శాతం మంది ఊబకాయం, 33 శాతం మంది గుండెజబ్బులకు గురయ్యారని 35 ఏళ్ల లోపు వారిలో ఈ సమస్యలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని విరించారు. గర్భాశయ తొలగింపు విషయంలో మహిళలు మరింత జాగరూకతతో వ్యవహరించేందుకు ఈ అధ్యయనం ఉపకరిస్తుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. -
శాకాహారంతోనే లైఫ్ ఎక్కువ
ఫోనిక్స్: శాకాహారులకు శుభవార్త! 17 ఏళ్లపాటు మాంసం జోలికి వెళ్లకుండా కేవలం శాకాహారమే తీసుకుంటే మనిషి ప్రామాణిక జీవితకాలం దాదాపు నాలుగేళ్లు పెరుగుతుందట. ఆరిజోనాలోని మాయో క్లినిక్ 15లక్షల మందిపై తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో మనిషి ప్రామాణిక జీవితకాలంలో 3.6 సంవత్సరాలు పెరుగుతుందని తేలింది. రోజూ మాంసం, ముఖ్యంగా శుద్ధి చేసిన మాంసాన్ని ఆరగించిన వాళ్లే తొందరగా మరణిస్తారని సర్వే తేల్చింది. గోమాంసం, పంది మాంసం, గొర్రె మాంసంతోపాటు బేకన్, సాసేజ్, సలామి, హాట్ డాగ్స్ తినేవారే త్వరగా మృత్యువాత పడుతున్నారని తాము నిర్వహించిన ఆరు రకాల సర్వేలో తేలిందని మాయో క్లినిక్ వర్గాలు తెలిపాయి. ఇలాంటి మాంసాహారం వల్ల కార్డియో వాస్కులర్, ఇస్కీమిక్ గుండె జబ్బులు వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. మాంసాహారానికి బదులుగా శాకాహారాన్ని తీసుకోవాల్సిందిగా సలహాలివ్వాలని ఫిజిషియన్లు, డైటీషియన్లను వారు కోరారు. తక్కువ మాంసం తీసుకునే వారు ఎక్కువ మాంసం తీసుకునే వారితో పోలిస్తే 25 నుంచి 50 శాతం వరకు ప్రాణాపాయం తక్కువగా ఉందని ఐదు లక్షల మంది ఆహార అలవాట్లపై జరిపిన అధ్యయనంలో తేలిందని ఆ వర్గాలు వివరించాయి. ఈ అధ్యయన వివరాలను 'అమెరికన్ ఆస్టియోపాతిక్ అసోసియేషన్' జర్నల్‌లో ప్రచురించారు. -
అంతరిక్షంలో మూలకణాల పెంపకం!
వాషింగ్టన్: రోదసీలో మానవ మూలకణాలు ఎలా అభివృద్ధి చెందుతాయో తెలుసుకునేందుకుగాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ప్రయోగం చేపట్టనున్నట్లు ఫ్లోరిడాలోని మయో క్లినిక్, సెల్ థెరపీ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మనిషి ఎముక మజ్జలోని మూలకణాలు భూమి మీద కన్నా అంతరిక్షంలో వేగంగా పెరుగుతాయా? అన్న కోణంలో ఈ పరిశోధన చేపట్టేందుకుగాను తమకు 3 లక్షల డాలర్ల నిధులు అందాయని శాస్త్రవేత్త అబ్బా జుబైర్ తెలిపారు. అంతరిక్షంలో మూలకణాలను వేగంగా అభివృద్ధిపర్చడం, వాటితో కణజాలాలు, అవయవాలను త్వరగా పెంచడమూ సాధ్యం అయితే గనక.. పక్షవాతం, వెన్నెముక గాయాలు, ఇతర అనేక సమస్యలు ఎదుర్కొనే రోగులకు అత్యంత త్వరగా, సమర్థంగా మూలకణ చికిత్స చేసేందుకు వీలవుతుందన్నారు.