శాకాహారంతోనే లైఫ్ ఎక్కువ
ఫోనిక్స్: శాకాహారులకు శుభవార్త! 17 ఏళ్లపాటు మాంసం జోలికి వెళ్లకుండా కేవలం శాకాహారమే తీసుకుంటే మనిషి ప్రామాణిక జీవితకాలం దాదాపు నాలుగేళ్లు పెరుగుతుందట. ఆరిజోనాలోని మాయో క్లినిక్ 15లక్షల మందిపై తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో మనిషి ప్రామాణిక జీవితకాలంలో 3.6 సంవత్సరాలు పెరుగుతుందని తేలింది. రోజూ మాంసం, ముఖ్యంగా శుద్ధి చేసిన మాంసాన్ని ఆరగించిన వాళ్లే తొందరగా మరణిస్తారని సర్వే తేల్చింది.
గోమాంసం, పంది మాంసం, గొర్రె మాంసంతోపాటు బేకన్, సాసేజ్, సలామి, హాట్ డాగ్స్ తినేవారే త్వరగా మృత్యువాత పడుతున్నారని తాము నిర్వహించిన ఆరు రకాల సర్వేలో తేలిందని మాయో క్లినిక్ వర్గాలు తెలిపాయి. ఇలాంటి మాంసాహారం వల్ల కార్డియో వాస్కులర్, ఇస్కీమిక్ గుండె జబ్బులు వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. మాంసాహారానికి బదులుగా శాకాహారాన్ని తీసుకోవాల్సిందిగా సలహాలివ్వాలని ఫిజిషియన్లు, డైటీషియన్లను వారు కోరారు.
తక్కువ మాంసం తీసుకునే వారు ఎక్కువ మాంసం తీసుకునే వారితో పోలిస్తే 25 నుంచి 50 శాతం వరకు ప్రాణాపాయం తక్కువగా ఉందని ఐదు లక్షల మంది ఆహార అలవాట్లపై జరిపిన అధ్యయనంలో తేలిందని ఆ వర్గాలు వివరించాయి. ఈ అధ్యయన వివరాలను 'అమెరికన్ ఆస్టియోపాతిక్ అసోసియేషన్' జర్నల్‌లో ప్రచురించారు.