లండన్ : రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే వారు స్లిమ్‌గా ఉండటంతో పాటు మున్ముందు బరువు పెరగకుండా ఉంటారని తాజా అథ్యయనం వెల్లడించింది. కేలరీలను తగ్గించుకునేందుకు, నాజూకుగా ఉండేందుకు పలువురు అల్పాహారం తీసుకోవడాన్ని విస్మరిస్తుంటారని, ఇది సరైంది కాదని మయో క్లినిక్ నిర్వహించిన అథ్యయనం పేర్కొంది. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే 350 మందిని పరిశీలించగా వారి నడుము భాగం సాధారణంగా ఉన్నట్టు గుర్తించామని, పదేళ్ల తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తీసుకోనివారు ఎనిమిది పౌండ్లు పెరిగారని తెలిపింది. రోజూ ఉదయాన్నే అల్పాహారం తీసుకున్నవారు పదేళ్లలో కేవలం మూడు పౌండ్ల బరువు మాత్రమే పెరిగారని పరిశోధకులు వెల్లడించారు.
బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకోనివారు సరైన మోతాదులో సమతుల ఆహారాన్ని పొందలేకపోవడం వల్లే వారిలో కొవ్వు పేరుకుపోతున్నట్టు తేలింది. బ్రేక్‌ఫాస్ట్‌ను తరచూ తీసుకోనివారితో పోలిస్తే నిత్యం బ్రేక్‌ఫాస్ట్ తీసుకునేవారు ఆరోగ్యంగా ఉన్నారని తమ పరిశోధనలో వెల్లడైందని మయో క్లినిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వీరెంద్ సోమర్స్ చెప్పారు. అల్పాహారం తీసుకోని వారిలో పొట్టభాగంలో కొవ్వు పేరుకుపోవడం ఆందోళనకరమని అన్నారు. ఈ కొవ్వు టాక్సిన్లను విడుదల చేయడం ద్వారా రక్త నాళాలకు విఘాతం కలుగుతుందన్నారు. తాజా పండ్లు, ధాన్యాలు, గింజలతో కూడిన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment