కేవలం 24 గంటల వ్యవధిలో 16 సార్లు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం సాధ్యమేనా? భూమిపై ఉన్న మనకు సాధ్యం కాకపోవచ్చు గానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో ఉన్న వ్యోమగాములకు ముమ్మాటికీ సాధ్యమే! వారు ఒక్కరోజులో 16 సార్లు నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష కేంద్రం భూమిచుట్టూ గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో కక్ష్యలో తిరుగుతుండడం వల్లే ఇది సాధ్యమవుతోంది. అంటే ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తారు.
వేర్వేరు టైమ్‌జోన్లలో వేగంగా ప్రయాణిస్తారు. మనకు ఒకరోజులో ఒకటే సూర్యోదయం, ఒకటే సూర్యాస్తమయం ఉంటే వ్యోమగాములు మాత్రం 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూస్తారు. మనకు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటే, వ్యోమగాములకు 45 నిమిషాలు పగలు, 45 నిమిషాలు రాత్రి ఉంటాయి. ఈ చక్రం నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది. మరోమాట.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూగోళం స్పష్టంగా కనిపిస్తుంది. భూమిపై విద్యుత్ వెలుగులను వ్యోమగాములు వీక్షిస్తుంటారు. న్యూ ఇయర్ సందర్భంగా 24 గంటల్లో 16 సార్లు వారు ఈ వేడుకలను తిలకిస్తారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment