భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఇప్పుడు శాస్త్రవేత్తలతోపాటు గండు చీమలు కూడా నివసిస్తున్నాయి! నాసా ఇటీవల 800 గండు చీమల్ని అక్కడికి పంపింది మరి. ఐఎస్‌ఎస్‌లో గురుత్వాకర్షణ ప్రభావం దాదాపుగా ఉండదు కాబట్టి.. ఆ ‘లో గ్రావిటీ’లో చీమలు ఎలా తిరుగుతాయో పరిశీలించేందుకే అక్కడికి పంపారు. ట్యాబ్లెట్ కంప్యూటర్ సైజులోని 8 ప్రత్యేక బాక్సులే ఆ చీమలకు ప్రస్తుతం కాలనీలు. వాటిలోనే అవి ఆహారం కోసం అన్వేషిస్తూ.. అటూ ఇటూ తిరుగుతూ జీవిస్తున్నాయి.
భూమిపై మాదిరిగా కాకుండా.. కాలనీలో ఎక్కువ చీమలు ఉన్నప్పుడు వృత్తాకార మార్గంలో తిరుగుతూ, తక్కువ చీమలు ఉన్నప్పుడు నేరుగా తిరుగుతూ ఎక్కువ ప్రదేశంలో ఆహారం కోసం అవి అన్వేషిస్తున్నాయట. ఐఎస్‌ఎస్‌లో ఉన్న శాస్త్రవేత్తలు ఈ చీమలను వీడియోలు తీసి భూమికి పంపుతున్నారు. ఈ ప్రయోగంతో ప్రయోజనం ఏంటంటే.. ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగిందనుకోండి. అందులోకి పంపే సహాయక రోబోలకు కూడా చీమల మాదిరిగా పరస్పరం సహకరించుకుంటూ, పరిస్థితులకు అనుగుణంగా పద్ధతులు మార్చుకుంటూ అన్వేషణ సాగించేలా శిక్షణ ఇవ్వవచ్చట.
అంతరిక్షంలో గండు చీమలు!
Published Tue, Jan 21 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
Advertisement