కేప్ కెనవెరాల్: నాలుగు వేర్వేరు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములతో స్పేస్ ఎక్స్ రాకెట్ శనివారం కేప్ కెనవెరాల్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లోకి ఆదివారం నలుగురు వ్యోమగాములు అడుగిడుతారు. మార్చి నెల నుంచి అక్కడే విధులు నిర్వర్తిస్తున్న వ్యోమగాముల స్థానంలో వీరు బాధ్యతలు చేపడతారు. ఆరు నెలలపాటు అక్కడుంటారు. నలుగురిలో ఒకరు నాసాకు చెందిన వారు కాగా, మిగతా ముగ్గురు డెన్మార్క్, జపాన్, రష్యా దేశస్తులు.
అమెరికా ఇలా ఒకే అంతరిక్ష నౌకలో వేర్వేరు దేశాలకు చెందిన వారిని ఐఎస్‌ఎస్‌కు పంపించడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు నాసా పంపించిన స్పేస్ ఎక్స్ ట్యాక్సీ రాకెట్లలో ఇద్దరు లేదా ముగ్గురు అమెరికన్లు ఉండేవారు. తాజా బృందానికి నాసాకు చెందిన జాస్మిన్ మొఘ్‌బెలి అనే మెరైన్ పైలట్ నాయకత్వం వహిస్తున్నారు. జాస్మిన్ తల్లిదండ్రులు ఇరాన్ దేశస్తులు. 1979లో ఇరాన్ విప్లవం సమయంలో జర్మనీ వెళ్లిపోయారు. అక్కడే జాస్మిన్ పుట్టారు. న్యూయార్క్‌లో పెరిగారు. అమెరికా మెరైన్స్ చేరి అఫ్గానిస్తాన్‌లో యుద్ధ హెలికాప్టర్లు నడిపారు. ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చని ఇరాన్ బాలికలకు చూపుతున్నానని ఆమె అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment