రక్షణ రంగ స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ, అంతరిక్ష పరిశోధన, ఉపకరణాల అభివృద్ధిలో ఉన్న స్టార్టప్‌లకు వెన్నుదన్నుగా నిలవాలని డీఆర్‌డీవో యోచిస్తోంది. ఇందుకోసం రూ.100-200 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ప్రారంభించాలని భావిస్తోంది. ‘ప్రతిభ గల యువత దేశంలో చాలా మంది ఉన్నారు.
ఇంక్యుబేషన్ సెంటర్లు అందరికీ అందుబాటులో లేవు. వారి వ్యాపార ఆలోచన కార్యరూపం దాల్చాలంటే సాఫ్ట్ లోన్ రూపంలో ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉంది’ అని రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్రీయ సలహాదారు, డీఆర్‌డీవో చీఫ్ అవినాశ్ చందర్ శుక్రవారం తెలిపారు. డిఫెన్స్, ఏరోసప్లై ఇండియా సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కీలక ముడిపదార్థాలను నిల్వ చేసే మెటీరియల్ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచామన్నారు.
టెక్నాలజీ సెంటర్లు..
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు డీఆర్‌డీవో దేశవ్యాప్తంగా 10 టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. తొలి రెండు కేంద్రాలు ఐఐటీ చెన్నై, ఐఐటీ ముంబైలో ఈ ఏడాదే రానున్నాయని అవినాష్ చందర్ తెలిపారు. ఒక్కో కేంద్రంలో 500 వరకు పీహెచ్‌డీ, ఎంటెక్ అభ్యర్థులను తీసుకునే అవకాశం ఉందన్నారు. యూనివర్సిటీల్లో రక్షణ రంగ పరిశోధనను పెంపొందించేందుకు ఏటా రూ.500 కోట్లు వ్యయం చేస్తామని చెప్పారు. రక్షణ సంబంధ వ్యవస్థలను పరీక్షించే కేంద్రాలను హైదరాబాద్ సమీపంలో నాగార్జున సాగర్, షామీర్‌పేట్, దుండిగల్ వద్ద రూ.1,500 కోట్లతో డీఆర్‌డీవో నెలకొల్పుతోంది.
యూఎస్ ఫండ్ ముందుకు..
అంతరిక్ష రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు యూఎస్ ఫండ్ ఒకటి ముందుకొచ్చిందని తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర వెల్లడించారు. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సీఈవో ఎస్‌జీకే కిషోర్ మాట్లాడుతూ నిపుణులైన మానవ వనరుల కొరత డిఫెన్స్, ఏరోస్పేస్ రంగ అభివృద్ధికి అడ్డంకిగా ఉందన్నారు.
ప్రభుత్వ అనుమతులకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. నైపుణ్య శిక్షణకు అవసరమైన పాఠ్యాంశాలను పరిశ్రమలే రూపొందించాలని ఐఐటీ హైదరాబాద్ డెరైక్టర్ యూబీ దేశాయ్ తెలిపారు. ప్రమాణాలు పాటించని కళాశాలకు తమ రాష్ట్రంలో ఇక తావులేదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు అన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.