Avinash Chander
-
విజయంతో ఘనంగా వీడ్కోలు
మొబైల్ లాంచర్ నుంచి సైతం అగ్ని-5 ఖండాంతర క్షిపణి తొలి సారిగా సత్తా చాటడంతో డీఆర్డీవో చీఫ్‌గా అవినాశ్ చందర్‌కు ఘనంగా వీడ్కోలు లభించినట్లయింది. డీఆర్డీవో చీఫ్‌గా శనివారం పదవి నుంచి ఆయన ఈ చివరి విజయంతో సంతృప్తిగా వైదొలిగారు. ‘డీఆర్డీవోలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాను. సంస్థ విజయాల్లో నాకు మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు. దేశానికి అధునాతన క్షిపణులను అందించగలిగినందుకు తృప్తితో వీడ్కోలు తీసుకుంటున్నా’ అని చందర్ అన్నారు. అగ్ని, ఇతర క్షిపణుల అభివృద్ధిలో విశేష కృషి చేసిన ‘అగ్ని మ్యాన్’గా పేరు తెచ్చుకున్న చందర్ కాంట్రాక్టును 15 నెలలు ముందుగానే కేంద్రం రద్దుచేయడం తెలిసిందే. డీఆర్డీవో బాధ్యతలను రక్షణ కార్యదర్శి ఆర్కే మాథుర్‌కు అదనంగా కేంద్రం అప్పగించింది. -
మిశ్రధాతువుల కేంద్రంగా హైదరాబాద్!
డీఆర్డీవో డీజీ అవినాశ్ చందర్ రీయిన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్స్‌పై అంతర్జాతీయ సదస్సు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రక్షణ, విమానయాన రంగాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ రానున్న కాలంలో మిశ్రధాతువుల (కాంపోజిట్స్) తయారీలోనూ కీలకపాత్ర పోషించనుందని డీఆర్డీవో డెరైక్టర్ జనరల్, రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ అవినాశ్ చందర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని హైటెక్స్ కేంద్రంలో రీయిన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్స్‌పై ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు (ఐసీఈఆర్‌పీ)లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మిశ్రధాతువుల వాడకం ద్వారా ఖర్చు తగ్గడమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలు ఉంటాయన్నారు. రైలు బోగీల్లో ఇప్పటికీ లోహాలను అధికంగా వాడుతున్నారని, మిశ్రధాతువుల వాడకంతో ఎక్కువ ప్రయాణికులను తీసుకెళ్లవచ్చన్నారు. అగ్ని క్షిపణుల్లో 90 శాతం వరకూ వీటినే వాడామన్నారు.. వచ్చే పదేళ్లలో లక్ష మంది మిశ్రధాతు నిపుణులు అవసరం కావచ్చునని ఆయన అంచనా వేశారు. అంతకుముందు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పారిశ్రామికంగా రాష్ట్రం త్వరగా ఎదిగేందుకు తమ ప్రభుత్వం అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. టీఎస్ఐపాస్ ద్వారా న్యాయ, పరిపాలన అనుమతులను వేగంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మిశ్రధాతువుల రంగానికి ప్రోత్సాహమిచ్చేందుకు హైదరాబాద్‌లో 100 ఎకరాల్లో పారి శ్రామికవాడను ఏర్పాటు చేస్తున్నామని తెలి పారు. కార్యక్రమంలో ఓవెన్స్ కార్నింగ్ వైస్ ప్రెసిడెంట్ మార్సియాస్ సండ్రీ, ఎఫ్ఆర్పీ ఇన్స్టిట్యూట్ చైర్మన్ సుభాష్ విట్టల్‌దాస్‌లు పాల్గొన్నారు. -
డీఆర్డీఓ చీఫ్ తొలగింపు
న్యూఢిల్లీ: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) చీఫ్ అవినాశ్చందర్ను తప్పుకోవాలని కేబినెట్ నియామకాల కమిటీ మంగళవారం ఆదేశించింది. ఈ నెల 31 నాటికి ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. చందర్ డీఆర్డీఓ కార్యదర్శిగా గతేడాది నవంబర్ 30న రిటైర్ అయినప్పటికీ, ఆయన పదవీ కాలాన్ని 18 నెలలు పొడిగించింది. కానీ ఈ పొడిగింపును ప్రభుత్వం 45 రోజుల్లోనే తొలగించడం గమనార్హం. -
రక్షణ రంగ స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ, అంతరిక్ష పరిశోధన, ఉపకరణాల అభివృద్ధిలో ఉన్న స్టార్టప్‌లకు వెన్నుదన్నుగా నిలవాలని డీఆర్డీవో యోచిస్తోంది. ఇందుకోసం రూ.100-200 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ప్రారంభించాలని భావిస్తోంది. ‘ప్రతిభ గల యువత దేశంలో చాలా మంది ఉన్నారు. ఇంక్యుబేషన్ సెంటర్లు అందరికీ అందుబాటులో లేవు. వారి వ్యాపార ఆలోచన కార్యరూపం దాల్చాలంటే సాఫ్ట్ లోన్ రూపంలో ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉంది’ అని రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్రీయ సలహాదారు, డీఆర్డీవో చీఫ్ అవినాశ్ చందర్ శుక్రవారం తెలిపారు. డిఫెన్స్, ఏరోసప్లై ఇండియా సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కీలక ముడిపదార్థాలను నిల్వ చేసే మెటీరియల్ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచామన్నారు. టెక్నాలజీ సెంటర్లు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు డీఆర్డీవో దేశవ్యాప్తంగా 10 టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. తొలి రెండు కేంద్రాలు ఐఐటీ చెన్నై, ఐఐటీ ముంబైలో ఈ ఏడాదే రానున్నాయని అవినాష్ చందర్ తెలిపారు. ఒక్కో కేంద్రంలో 500 వరకు పీహెచ్డీ, ఎంటెక్ అభ్యర్థులను తీసుకునే అవకాశం ఉందన్నారు. యూనివర్సిటీల్లో రక్షణ రంగ పరిశోధనను పెంపొందించేందుకు ఏటా రూ.500 కోట్లు వ్యయం చేస్తామని చెప్పారు. రక్షణ సంబంధ వ్యవస్థలను పరీక్షించే కేంద్రాలను హైదరాబాద్ సమీపంలో నాగార్జున సాగర్, షామీర్పేట్, దుండిగల్ వద్ద రూ.1,500 కోట్లతో డీఆర్డీవో నెలకొల్పుతోంది. యూఎస్ ఫండ్ ముందుకు.. అంతరిక్ష రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు యూఎస్ ఫండ్ ఒకటి ముందుకొచ్చిందని తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర వెల్లడించారు. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సీఈవో ఎస్జీకే కిషోర్ మాట్లాడుతూ నిపుణులైన మానవ వనరుల కొరత డిఫెన్స్, ఏరోస్పేస్ రంగ అభివృద్ధికి అడ్డంకిగా ఉందన్నారు. ప్రభుత్వ అనుమతులకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. నైపుణ్య శిక్షణకు అవసరమైన పాఠ్యాంశాలను పరిశ్రమలే రూపొందించాలని ఐఐటీ హైదరాబాద్ డెరైక్టర్ యూబీ దేశాయ్ తెలిపారు. ప్రమాణాలు పాటించని కళాశాలకు తమ రాష్ట్రంలో ఇక తావులేదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు అన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
పరిశోధనలకు ప్రాణం పోయండి
వర్సిటీలకు డీఆర్డీవో డీజీ అవినాష్ చందర్ సూచన ఘనంగా ‘గీతం’ విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవం విశాఖపట్నం: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన ఆవిష్కరణలపైనే ఒక దేశం శక్తి సామర్థ్యాలు ఆధారపడి ఉన్నాయని రక్షణ శాఖ శాస్త్ర సలహాదారు, రక్షణ పరిశోధన-అభివృద్ధి (డీఆర్డీవో) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అవినాష్ చందర్ పేర్కొన్నారు. దేశంలోని యూనివర్సిటీలు పరిశోధనలకు ప్రాధాన్యం పెంచాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు బోధనతోపాటు ఇంధన వనరులు, వాతావరణ మార్పు లు, రక్షిత మంచినీరు లాంటి అంశాలపై పరిశోధనలు జరపాలన్నారు. శనివారం విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. శాస్త్రసాంకేతి రంగంలో భారత్ ప్రపంచంలోనే మేటి శక్తిగా ఎదుగుతోందన్నారు. గీతం ఛాన్సలర్ ప్రొఫెసర్ కోనేరురామకృష్ణారావు ఈ సందర్భంగా అవి నాష్ చందర్‌కు డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. కె.రాఘవేంద్రరావు, సుద్దాల అశోక్‌తేజ, శైలజా కిరణ్‌లు డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డి.లిట్) గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. 1,220 మంది విద్యార్థులకు పట్టాలను అందచేశారు. వీరిలో పీహెచ్డీ, ఎంఫిల్ పూర్తి చేసిన వారు 24 ఉన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 56 మందికి స్వర్ణ పతకాలను ఇచ్చారు. -
మిస్సైల్స్ రూపకర్త అవినాశ్ చందర్‌కు డాక్టరేట్
విశాఖపట్నం:మిస్సైల్స్ రూపకర్త, కేంద్ర రక్షణశాఖ శాస్త్రసాంకేతిక సలహాదారు డాక్టర్ అవినాశ్ చందర్‌కు గీతం విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. గీతమ్ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా డాక్టర్ అవినాశ్ చందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు డాక్టర్ ఆఫ్ సైన్స్ ప్రదానం చేశారు. సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ, దర్శక నిర్మాత రాఘవేంద్రరావు, పారిశ్రామికవేత్త మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్లకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. ** -
నిట్ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
నేడు మధ్యాహ్నం 2.30గంటలకు ప్రారంభం ఎనిమిది మందికి బంగారు పతకాలు, 1427 మందికి పట్టాల ప్రదానం హాజరుకానున్న పద్మశ్రీ అవినాష్ చందర్ నిట్ క్యాంపస్ : వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) 12వ స్నాతకోత్సవం శనివారం జరగనుంది. ఈ మేరకు నిట్ డెరైక్టర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో అధికారులు, అధ్యాపకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నిట్‌లోని సెమినార్ హాల్లో విద్యార్తుల కోసం రిపోర్టింగ్ సెంటర్ ఏర్పాటుచేయగా, శుక్రవారం సాయంత్రానికే చేరుకున్న వివిధ ప్రాంతాల విద్యార్థులు పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు. అంతేకాకుండా స్నాతకోత్సవ ఏర్పాట్లపై నిట్ డెరైక్టర్ శుక్రవారం మధ్యాహ్నం అన్ని విభాగాల డీన్లతో సమావేశమయ్యారు. అలాగే, స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని నిట్ ఆడిటోరియం, మెయిన్ గేట్ వద్ద విద్యుద్దీపాలతో అలంకరించారు. ఎనిమిది మందికి బంగారు పతకాలు నిట్ ఆడిటోరియంలో శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు స్నాతకోత్సవం ప్రారంభమవుతుందని డెరైక్టర్ టి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి నిట్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ కృష్ణ గౌరవ అతిథిగా, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) డెరెక్టర్ జనరల్, రక్షణ మంత్రి సైంటిఫిక్ అడ్వైజర్ పద్మశ్రీ అవినాష్ చందర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎనిమిది మందికి బంగారు పతకాలతో పాటు, 39మంది పీహెచ్డీస్కాలర్లు, 668మంది పోస్ట్గ్రాడ్యుయేట్లు, 720మంది బీటెక్ గ్రాడ్యుయేట్లకు పట్టాలు ప్రదానం చేస్తారు. కాగా, బంగారు పతకాలు అందుకోనున్న వారిలో బీటెక్ ఈసీఈ టాపర్ జి.విశాల్ లక్ష్మణ్‌రావు, సివిల్ ఇంజినీరింగ్‌లో హైదరాబాద్ మెహదీపట్నంకు చెందిన వి.శ్రీహిత, ఈఈఈ నుంచి కూకట్‌పల్లికి చెందిన జాస్తి సాయితేజ, మెకానికల్ ఇంజినీరింగ్ నుంచి ముంబైకి చెందిన పవర్ ప్రతిక్మనోహర్, ఎంఎంఈ నుంచి హైదరాబాద్‌కు చెందిన కె.శారదాదేవి, కెమికల్ ఇంజినీరింగ్‌లో హైదరాబాద్‌కు చెందిన అట్లూరి శ్రీ దిద్య, సీఎస్ఈలో హైదరాబాద్‌కు చెందిన సీహెచ్.అశ్విని, బయోటెక్నాలజీలో పశ్చిమగోదావరి జిల్లా వరిగేడుకు చెందిన గడంశెట్టి సౌమ్య ఉన్నారు. -
తీరానికి రాజయోగం
క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు దేశంలోనే రెండోది గుల్లలమోద-లైట్‌హౌస్ మడ అటవీ ప్రాంతం ఎంపిక? నాగాయలంక : బంగాళాఖాతం సరిహద్దు తీరప్రాంతమైన నాగాయలంక మండలానికి రాజయోగం పట్టనుందనే వార్తలొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే క్షిపణి ప్రయోగ కేంద్ర మే ఇందుకు కారణంగా తెలుస్తుంది. రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో) ఆధ్వర్యంలో దేశంలోనే రెండో క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని రూ. 1000 కోట్లతో నాగాయలంక సాగర తీరం గుల్లలమోద-లైట్‌హౌస్ మడ అటవీ ప్రాంతంలో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అటవీశాఖ, పర్యావరణ అనుమతుల నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 3వ తేదీన డీఆర్డీవో ఉన్నతాధికారులు, అటవీ శాఖ ప్రిన్సిపల్ సీసీఎఫ్ (చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) జోసఫ్, వైల్డ్ లైఫ్ సీసీఎస్ శ్రీధర్ గుల్లలమోద-లైట్‌హౌస్ ప్రాంతాల్లో పర్యటించి నిశితంగా అధ్యయనం చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో (గత ఏడాది చివరిలో) ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్పటి కేంద్ర రక్షణ మంత్రి శాస్త్రి సలహాదారుడు పద్మశ్రీ అవినాష్ చందర్ ఈ అంశాన్ని ధ్రువీకరించారు. నాగాయలంక తీరప్రాంతంలో మిస్సైల్ లాంచింగ్ సెంటర్‌ను ఏర్పాటుచేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు అప్పట్లో వెల్లడించారు. ఆయన ప్రకటన చేసిన నెల రోజుల్లోనే డీఆర్డీవో, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇక్కడ పర్యటించారు. దరిమిలా డీఆర్డీవోతోపాటు పలువురు రక్షణ రంగ నిపుణులు దేశంలోని ఇతర ప్రాంతాలు పరిశీలించిన మీదట నాగాయలంక తీరప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. గుల్లలమోద ప్రాంతంలో ఒక వైపు మాత్రమే భూమి ఉంది. తూర్పు-దక్షిణ భాగాల్లో బంగాళాఖాతం, పడమరవైపు కృష్ణానది ఉంటాయి. ఓడిశాలోని బాలాసోర్ వీలర్ ఐలాండ్ క్షిపణి ప్రయోగకేంద్రం మాదిరిగానే నాగాయలంకలోని గుల్లలమోద తీర భౌగోళిక స్వరూపం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చిన మీదట రక్షణ పరంగా అన్ని విధాలుగా అనుకూలమైనదిగా భావించారని తెలుస్తుంది. మహర్దశ పడుతుందా? ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో మిస్సైల్ లాంచింగ్ సెంటర్ నాగాయలంక తీరంలో ఖాయమని భావిస్తుండటంతో ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఈ మండలమే కాకుండా జిల్లా రూపురేఖలే మారిపోతాయని అంచనా వేస్తున్నారు. 40 ఎకరాల్లో అధికారులు, సిబ్బంది కోసం నిర్మించే ప్రత్యేక క్వార్టర్స్, 40కి.మీ పరిధిలో రహదారుల సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రత్యక్ష, పరోక్షంగా పాతికవేల మంది వరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రక్షణ శాఖ నిపుణులు చెబుతున్నారు. -
దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలకం
జేఎన్టీయూ, న్యూస్‌లైన్ : దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలక పాత్ర పోషిస్తుందని డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) చీఫ్ అవినాష్ చందర్ అన్నారు. పరిశోధన ఫలాలు సామాన్యులకు అందించినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందన్నారు. ఆ దిశగా పరిశోధనలు చేయాలని విద్యార్థులకు సూచించారు. సోమవారం అనంతపురం జవహల్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ-ఎ) పరిపాలన భవనంలో ఐదో స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వీసీ లాల్‌కిశోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవినాష్ చందర్ హాజరై ప్రసంగించారు. భారతదేశంలో మేథో సంపత్తికి కొదవ లేదని, ఎంతో మంది ఇంజనీర్ల కృషి ఫలితంగా నేడు ‘అగ్ని’ వంటి క్షిపణులను స్వయంగా తయారు చేసుకోగలిగామన్నారు. ఇదే సమయంలో కొందరు వలసబాట పట్టడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల కృషితో దేశంలోని మేథో సంపత్తిని సద్వినియోగం చేసుకుని దేశీయంగా ఆశించిన విజయాలు సాధించామన్నారు. ఇందుకు అనంతపురం జేఎన్టీయూకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తల ప్రతిభా పాటవాలే నిదర్శనమన్నారు. ప్రాచీన కాలం నుంచి ఆంధ్రప్రదేశ్.. సాంకేతిక పరిజ్ఞానానికి హబ్‌గా వెలుగొందిందన్నారు. అదే సంప్రదాయాన్ని మున్ముందు కొనసాగించాలన్నారు. ఇంజనీర్లు అవిశ్రాంతంగా చేసిన కృషి షలితంగా దేశీయంగా అగ్ని, చంద్రయాన్, మంగళయాన్, జీఎస్ఎల్వీ, వివిధ రకాల యుద్ధ యంత్రాల తయారీ, ఆధునిక పరిశోధనలు సాధ్యమయ్యాయన్నారు. వాటి ఫలితాలను నెహ్రూ కాలం నుంచి నేటి వరకూ పొందుతున్నామన్నారు. ఈ ఫలితాలతో సాంకేతిక రంగంలో భారత దేశం ఒక శాస్త్ర లీడర్‌గా నిలుస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించిన 200 ఉత్తమ పరిశోధనా సంస్థలలో భారత దేశానికి చెందిన ఒక్కదానికి కూడా చోటు దక్కకపోవడం పట్ల ఆయన ఆందోళన చెందారు. దేశంలో విద్యను అభ్యసించిన ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, మేధావులు ఇతర దేశాలకు వలసబాట పట్డడమే ప్రధాన కారణమన్నారు. ఇది ఎంతమాత్రం తగదని.. దేశీయంగా తమ ప్రతిభను చాటి దేశ ప్రతిష్టను ఇనుమడింప చేయడంలో భాగస్వాములు కావాలని భావి ఇంజినీర్లకు సూచించారు. భాతరదేశ సాంకేతిక విజ్ఞాన పరిశోధనా రంగంలో పంజాబ్ యూనివర్శిటీ తర్వాత అనంతపురం జేఎన్టీయూ దేశ వ్యాప్తంగా రెండో స్థానంలో నిలుస్తోందన్నారు. దేశంలో ఇంజినీరింగ్ విద్య అభ్యసించిన వారు డీఆర్డీఓలో కీలకంగా మారారన్నారు. అందుకు గతంలో అగ్ని ప్రయోగంలో ఏర్పడిన లోపాలను డిసెంబర్ 31వ తేదీ రాత్రికి రాత్రే బాలాసోర్ పరిశోధనా క్షేత్రాన్ని చేరుకుని క్షిపణి లోపాలను సరిదిద్దడమే నిదర్శనమన్నారు. విద్యాభ్యాసానికి దీటుగా పరిశోధనలకు జేఎన్టీయూ ప్రాధాన్యత ఇవ్వడం ఆహ్వానించదగ్గ విషయన్నారు. పరిశోధనలో నాణ్యతా ప్రమాణాల పెంపు పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలు, విలువలతో కూడిన విద్యకు పెద్దపీట వేశామని జేఎన్టీయూ వీసీ లాల్‌కిశోర్ అన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, నిధులను ఎప్పటికప్పుడు సమకూర్చుతున్నామన్నారు. నిష్ణాతులైన అధ్యాపకులతో విద్యాబోధన సాగుతోందన్నారు. సాంకేతిక విద్యకు చుక్కానిలా వర్శిటీని తీర్చిదిద్దామన్నారు. వర్శిటీలో 14 బీటెక్, 69 బీఫార్మా, ఫార్మాడీ, ఎంటెక్, ఎంఫార్మా స్పెషలైజేషన్ కోర్సులు, 5 ఎమ్మెస్సీ, 3 ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మాడీ(పీబీ) కోర్సులు నడుస్తున్నాయన్నారు. ఎంఎస్‌ఐటీ కోర్సును నూతనంగా ఈ ఏడాది నుంచి ప్రారంభించామన్నారు. విదేశీ యూనివర్శిటీలతో అవగాహన ఒప్పందాలు, వీఎల్ఐసీ సిస్టమ్ డిజైన్, ఎంబేడెడ్ సిస్టమ్స్ లాంటి కొత్త ప్రోగ్రాంలను పరిచయం చేశామన్నారు. కలికిరిలో నూతనంగా వర్శిటీ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ సుదర్శన్‌రావ్, రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి, డెరైక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇక యుద్ధాలన్నీ మానవ రహిత క్షేత్రాల్లోనే
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో దేశాల మధ్య యుద్ధాలన్నీ మానవరహిత యుద్ధ క్షేత్రాల్లోనే జరగనున్నాయని డీఆర్డీవో డెరైక్టర్ జనరల్, రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు పద్మశ్రీ అవినాష్‌చందర్ పేర్కొన్నారు. మానవ రహిత యుద్ధ క్షేత్రాల్లో మైక్రో ఎయిర్ వెహికల్స్ ముఖ్య భూమిక పోషించనున్నాయని చెప్పారు. మైక్రో ఎయిర్ వెహికల్స్ రూపకల్పన, అభివృద్ధి, ఆపరేషన్స్‌లో తాజా ఆవిష్కరణలపై జేఎన్టీయూహెచ్లో గురువారం ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు(ఐసీఆర్ఎఎంఏవీ-13)కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మైక్రో ఎయిర్ వెహికల్స్(మిస్సైల్స్) ద్వారా 5 వేల కి.మీ. దూరంలోని లక్ష్యాలను చేధించగలుగుతున్నామని చెప్పారు. జేఎన్టీయూహెచ్ కు ఆ సత్తా ఉంది: రక్షణ రంగంతోపాటు సమాజానికి మేలు చేకూర్చే మైక్రో ఎయిర్ వెహికల్స్‌ను రూపొందించగలిగే సత్తా జేఎన్టీయూహెచ్కు ఉందని వర్సిటీ మాజీ వీసీ, ఏఐసీటీఈ సదరన్ రీజియన్ చైర్మన్ డాక్టర్ కె.రాజగోపాల్ చెప్పారు. అద్భుతమైన అవకాశాలున్న ఈ రంగం వైపు దృష్టి సారించాలని విద్యార్థులను కోరారు. సముద్ర గర్భాల్లోకి కూడా మైక్రో ఎయిర్ వెహికల్స్‌ను పంపవచ్చని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ రామేశ్వర్రావు తెలిపారు. సదస్సులో‘ సెన్సార్స్ అండ్ ఏవియానిక్స్’ అంశంపై డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ(పుణే) వీసీ డాక్టర్ ఆర్.ప్రహ్లాద ఉపన్యాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఎన్వీ రమణరావు, రెక్టార్ సాయిబాబారెడ్డి, సదస్సు కన్వీనర్ మాధవీలత, కో-కన్వీనర్లు సుధీర్ ప్రేమ్‌కుమార్, జీకే విశ్వనాథ్, యాదయ్య, డెరైక్టర్లు ముక్కంటి, రామకృష్ణప్రసాద్, ఆర్యశ్రీ, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్ సవాళ్లకు సిద్ధమవ్వాలి: అవినాశ్ చందర్
సాక్షి, హైదరాబాద్: అగ్ని, పృథ్వీ క్షిపణుల అభివృద్ధిలో సాధించిన స్వావలంబన వెనుక డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (డీఎంఆర్ఎల్) పాత్ర ఎంతో ఉందని రక్షణ శాఖ శాస్త్రీయ సలహాదారు, డీఆర్డీవో డెరైక్టర్ జనరల్ అవినాశ్ చందర్ కొనియాడారు. హైపర్సోనిక్ స్క్రామ్ జెట్ ఇంజిన్లను తయారు చేయడం వెనుక డీఎంఆర్ఎల్ శాస్త్రవేత్తల కృషి ఎంతైనా ఉందని, వీటికి అవసరమైన సంక్లిష్టమైన మిశ్రమ లోహాలను అభివృద్ధి చేసిన ఘనత ఆ సంస్థకే దక్కుతుందని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని డీఎంఆర్ఎల్ కార్యలయంలో సంస్థ స్వర్ణోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాని కి ముఖ్యఅతిథిగా హాజరైన అవినాశ్ చందర్ మాట్లాడుతూ.. సాధించిన దాంతో తృప్తి చెందితే ప్రయోజనం లేదని, భవిష్యత్ సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు డీఎంఆర్ఎల్ ప్రయత్నించాల్సి ఉంటుందన్నారు. ఉక్కు స్థానంలో మరింత మెరుగైన మిశ్రధాతువుల వినియోగం పెరుగుతోందని, టంగ్స్టన్, టైటానియం వంటి లోహాల శుద్ధీకరణకు సంబంధించి ఇప్పటికీ కొన్ని లోటుపాట్లు ఉన్నాయని వివరించారు. వీటన్నింటినీ అధిగమించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు. రోబో సైన్యంతోపాటు, మానవరహిత యుద్ధాన్ని నడిపేందుకు భారత్ సిద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో డీఎంఆర్ఎల్ మరింత నిబద్ధతతో పని చేయాల్సిన అవసరముందని చెప్పారు. డీఎంఆర్ఎల్ స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన రజత జ్ఞాపికను అవినాశ్ చందర్ ఆవిష్కరించారు. 50 ఏళ్లలో సంస్థ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సంకలనాన్ని గౌరవ అతిథి, నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ వి.భుజంగరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎంఆర్ఎల్ మాజీ డెరైక్టర్లు డాక్టర్ వి.ఎస్.అరుణాచలం, పి.రామారావు, దీపాంకర్ బెనర్జీ, ఎ.ఎం.శ్రీరామమూర్తి, జి.మాలకొండయ్య, డీఎంఆర్ఎల్ ప్రస్తుత డెరైక్టర్ అముల్ గోఖలే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ మాజీ డెరైక్టర్లందరినీ సన్మానించారు.