నిట్ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
- నేడు మధ్యాహ్నం 2.30గంటలకు ప్రారంభం
- ఎనిమిది మందికి బంగారు పతకాలు, 1427 మందికి పట్టాల ప్రదానం
- హాజరుకానున్న పద్మశ్రీ అవినాష్ చందర్
నిట్ క్యాంపస్ : వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) 12వ స్నాతకోత్సవం శనివారం జరగనుంది. ఈ మేరకు నిట్ డెరైక్టర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో అధికారులు, అధ్యాపకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నిట్‌లోని సెమినార్ హాల్‌లో విద్యార్తుల కోసం రిపోర్టింగ్ సెంటర్ ఏర్పాటుచేయగా, శుక్రవారం సాయంత్రానికే చేరుకున్న వివిధ ప్రాంతాల విద్యార్థులు పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు. అంతేకాకుండా స్నాతకోత్సవ ఏర్పాట్లపై నిట్ డెరైక్టర్ శుక్రవారం మధ్యాహ్నం అన్ని విభాగాల డీన్లతో సమావేశమయ్యారు. అలాగే, స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని నిట్ ఆడిటోరియం, మెయిన్ గేట్ వద్ద విద్యుద్దీపాలతో అలంకరించారు.
ఎనిమిది మందికి బంగారు పతకాలు
నిట్ ఆడిటోరియంలో శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు స్నాతకోత్సవం ప్రారంభమవుతుందని డెరైక్టర్ టి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి నిట్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ కృష్ణ గౌరవ అతిథిగా, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ) డెరెక్టర్ జనరల్, రక్షణ మంత్రి సైంటిఫిక్ అడ్వైజర్ పద్మశ్రీ అవినాష్ చందర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.
ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎనిమిది మందికి బంగారు పతకాలతో పాటు, 39మంది పీహెచ్‌డీస్కాలర్లు, 668మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్లు, 720మంది బీటెక్ గ్రాడ్యుయేట్లకు పట్టాలు ప్రదానం చేస్తారు. కాగా, బంగారు పతకాలు అందుకోనున్న వారిలో బీటెక్ ఈసీఈ టాపర్ జి.విశాల్ లక్ష్మణ్‌రావు, సివిల్ ఇంజినీరింగ్‌లో హైదరాబాద్ మెహదీపట్నంకు చెందిన వి.శ్రీహిత, ఈఈఈ నుంచి కూకట్‌పల్లికి చెందిన జాస్తి సాయితేజ, మెకానికల్ ఇంజినీరింగ్ నుంచి ముంబైకి చెందిన పవర్ ప్రతిక్‌మనోహర్, ఎంఎంఈ నుంచి హైదరాబాద్‌కు చెందిన కె.శారదాదేవి, కెమికల్ ఇంజినీరింగ్‌లో హైదరాబాద్‌కు చెందిన అట్లూరి శ్రీ దిద్య, సీఎస్‌ఈలో హైదరాబాద్‌కు చెందిన సీహెచ్.అశ్విని, బయోటెక్నాలజీలో పశ్చిమగోదావరి జిల్లా వరిగేడుకు చెందిన గడంశెట్టి సౌమ్య ఉన్నారు.