
డిఫెన్స్ ఉత్పత్తుల ఎగుమతుల్లో దూసుకుపోతున్నాం
‘సాక్షి’తో డీఆర్‌డీవో మాజీ చీఫ్, రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారు డా.అవినాష్ చందర్
బ్రిటిష్ విద్యా విధానం ఉపాధి తప్పశాస్త్రీయ అవకాశాలివ్వడం లేదు
అందుకే పరిశోధనలకు ఊతమిచ్చేలా నూతన విద్యా విధానం
పరిశోధన– అభివృద్ధిపై మరింత ఎదగాలి
చైనాలో 85కు పైగా డిఫెన్స్ రీసెర్చ్ పార్క్‌లు.. మన దేశంలో నాలుగైదే
రక్షణ ఉత్పత్తుల్లో స్టార్టప్స్, ఎంఎస్‌ఎంఈలదే ముఖ్య భూమిక
సాక్షి, విశాఖపట్నం: రక్షణ పరిశోధన సాంకేతిక రంగంలో భారత్ దూకుడుగా వ్యవహరిస్తూ అగ్ర దేశాలతో పోటీ పడుతోందని డీఆర్‌డీవో మాజీ చీఫ్, రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్రీయ సలహాదారు డా.అవినాష్ చందర్ అన్నారు. డిఫెన్స్ ఉత్పత్తుల ఎగుమతుల్లో దూసుకుపోతున్నామని, అయితే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విషయంలో భారత్ మరింత పురోభివృద్ధి సాధించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కొ
త్త విద్యా విధానం పరిశోధనలకు ఊతమిచ్చేలా అద్భుతంగా ఉందని కొనియాడారు. ఎన్‌ఎస్‌టీఎల్‌లో బుధవారం నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విశాఖపట్నం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
బ్రిటీష్ విద్యా విధానం నుంచి బయటపడ్డాం
ఏళ్ల తరబడి బ్రిటీష్ విద్యా విధానాన్ని దేశంలో అమలు చేస్తున్నాం. ఈ విధానం విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా రూపొందించారు. కొత్తగా అమలు చేస్తున్న విధానం.. విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విధానం.. ఉపాధి అవకాశాలు మాత్రమే కాదు.. 10 మందికి ఉపాధి కల్పించేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతుంది.
శాస్త్రీయ పద్ధతుల్లో బోధన, పరిశోధనల వైపు భారతీయ విద్యార్థుల్ని నడిపిస్తుండటం నూతన అధ్యాయం. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌పై ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది. చైనాలో 85కు పైగా డిఫెన్స్ రీసెర్చ్ పార్క్‌లు ఉంటే.. మన దేశంలో నాలుగైదు మాత్రమే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి.. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుండటం శుభ పరిణామం. ఎందుకంటే దేశంలో పరిశోధనలకు అపారమైన అవకాశాలున్నాయి.
రక్షణ రంగంలో విజయవంతంగా ప్రయోగాలు
డీఆర్‌డీవో నిర్వహిస్తున్న అనేక ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి. ఇది భారత రక్షణ వ్యవస్థని మరింత బలోపేతం చేస్తోంది. నేవల్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్(బీఎండీ) సామర్థ్యంలో అగ్రదేశాల సరసన నిలుస్తూ.. ఎలైట్ క్లబ్ ఆఫ్ నేషన్స్‌లో చేరాం. యుద్ధనౌక, భూమి నుంచి శత్రు బాలిస్టిక్ క్షిపణులను నిలువరించే సామర్థ్యాల్ని భారత్ అభివృద్ధి చేసింది. అంతకు ముందే భూ ఆధారిత క్షిపణి ప్రయోగం కూడా విజయవంతంగా నిర్వహించాం.
ఈ విజయాలతో సుదూర అణు క్షిపణులు, హైపర్ సోనిక్ మిసైల్స్, గ్లైడర్స్, శత్రు విమానాల్ని అడ్డుకోగల సామర్థ్యం భారత్ సొంతం చేసుకుంది. రక్షణ రంగంలో ఫుల్ ఫ్లెడ్జ్ వెపన్ సిస్టమ్స్ అభివృద్ధి చేసేలా ఎల్ అండ్ టీ, టాటా.. ఇలా ఎన్నో ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఈ కారణంగా.. మన ఆయుధ సంపత్తిని అవసరాలకు అనుగుణంగా పెంచుకునేంత సామర్థ్యాన్ని సా«ధించాం.
భారత రక్షణ రంగం.. నిరంతరం కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల్ని అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా.. హైపర్ సోనిక్ లైట్ వెహికల్స్, హైపర్ సోనిక్ మిసైల్స్‌ని తయారు చేస్తున్నాం. శత్రు దేశాల రహస్య స్థావరాలపై దాడి చేసేలా మిసైల్స్‌లో సాంకేతికతని రూపొందించడం భవిష్యత్తులో మన ముందున్న లక్ష్యం. ప్రస్తుతం మనం తయారు చేస్తున్న మిసైల్స్ అన్నీ వేగం, గమనంపై ఆధారపడి దూసుకుపోతున్నాయి.
ఇప్పుడు ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్‌తో అనుసంధానం చేస్తూ పరిశోధనలు సాగుతున్నాయి. ఎగుమతుల విషయంలోనూ భారత్ అగ్ర దేశాలతో పోటీ పడుతోంది. ఆకాష్, బ్రహ్మోస్, అస్త్ర, ఇనాకా.. ఇలా భారత రక్షణ రంగానికి చెందిన ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేందుకు వివిధ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి.
స్టార్టప్స్.. ఎంఎస్‌ఎంఈలకు అపార అవకాశాలు
రక్షణ శాఖ సహకారంతో డీఆర్‌డీవో నిరంతర పరిశోధనలపై భారత్ దృష్టి సారిస్తోంది. రక్షణ రంగంలో ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్స్‌ని డీఆర్‌డీవో ప్రోత్సహిస్తోంది. ఈ సెక్టార్‌లో ఎదురవుతున్న సవాళ్లను అధిగవిుంచే ప్రాజెక్టులతో ముందుకొస్తున్న అంకుర సంస్థలకు చేయూత అందిస్తోంది. ఇందుకోసం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్‌ని కూడా ప్రభుత్వం సమకూర్చుతోంది. డిఫెన్స్ సిస్టమ్, టెక్నాలజీపై డీఆర్‌డీవోతో 1000కి పైగా ఎంఎస్‌ఎంఈలు పని చేస్తున్నాయి.
ఇంతకు ముందు చాలా అభివృద్ధి చెందిన ప్రయోగశాల్లో మాత్రమే పరిశోధనలు నిర్వహించి.. పరిశ్రమలకు బదిలీ చేసేవాళ్లం. కానీ.. ఇప్పుడు రూట్ మార్చుతున్నాం. సాంకేతిక రంగాల్లో పరిశ్రమలతో అనుబంధంగా పని చేస్తున్నాం. డీఆర్‌డీవో మెంటార్‌షిప్‌తో డ్రోన్లు, రాడార్లు, మినియేచర్ రాడార్లు, మినియేచర్ సెన్సార్లు, లైట్ వెయిట్ రాడార్లపై స్టార్టప్‌లు పని చేస్తుండటం శుభ పరిణామం.
ఎన్‌ఎస్‌టీఎల్ వంటి సంస్థతో రక్షణ రంగానికి సంబంధించి విశాఖపట్నం బ్రాండ్‌గా ఎదుగుతోంది. వెపన్ సిస్టమ్ డిజైన్ చెయ్యడంలో, అండర్ వాటర్ టెక్నాలజీ విషయంలో ఎన్‌ఎస్‌టీలో కీలక పాత్ర పోషిస్తోంది. నౌకా దళ ఆయుధ సంపత్తి బలోపేతమవుతోంది. విశాఖపట్నంలో నేవల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment