పరిశోధనలకు ప్రాణం పోయండి
వర్సిటీలకు డీఆర్‌డీవో డీజీ అవినాష్ చందర్ సూచన
ఘనంగా ‘గీతం’ విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవం
విశాఖపట్నం: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన ఆవిష్కరణలపైనే ఒక దేశం శక్తి సామర్థ్యాలు ఆధారపడి ఉన్నాయని రక్షణ శాఖ శాస్త్ర సలహాదారు, రక్షణ పరిశోధన-అభివృద్ధి (డీఆర్‌డీవో) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అవినాష్ చందర్ పేర్కొన్నారు. దేశంలోని యూనివర్సిటీలు పరిశోధనలకు ప్రాధాన్యం పెంచాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు బోధనతోపాటు ఇంధన వనరులు, వాతావరణ మార్పు లు, రక్షిత మంచినీరు లాంటి అంశాలపై పరిశోధనలు జరపాలన్నారు. శనివారం విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. శాస్త్రసాంకేతి రంగంలో భారత్ ప్రపంచంలోనే మేటి శక్తిగా ఎదుగుతోందన్నారు.
గీతం ఛాన్సలర్ ప్రొఫెసర్ కోనేరురామకృష్ణారావు ఈ సందర్భంగా అవి నాష్ చందర్‌కు డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. కె.రాఘవేంద్రరావు, సుద్దాల అశోక్‌తేజ, శైలజా కిరణ్‌లు డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డి.లిట్) గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. 1,220 మంది విద్యార్థులకు పట్టాలను అందచేశారు. వీరిలో పీహెచ్‌డీ, ఎంఫిల్ పూర్తి చేసిన వారు 24 ఉన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 56 మందికి స్వర్ణ పతకాలను ఇచ్చారు.