సాక్షి, హైదరాబాద్: అగ్ని, పృథ్వీ క్షిపణుల అభివృద్ధిలో సాధించిన స్వావలంబన వెనుక డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (డీఎంఆర్‌ఎల్) పాత్ర ఎంతో ఉందని రక్షణ శాఖ శాస్త్రీయ సలహాదారు, డీఆర్‌డీవో డెరైక్టర్ జనరల్ అవినాశ్ చందర్ కొనియాడారు. హైపర్‌సోనిక్ స్క్రామ్ జెట్ ఇంజిన్లను తయారు చేయడం వెనుక డీఎంఆర్‌ఎల్ శాస్త్రవేత్తల కృషి ఎంతైనా ఉందని, వీటికి అవసరమైన సంక్లిష్టమైన మిశ్రమ లోహాలను అభివృద్ధి చేసిన ఘనత ఆ సంస్థకే దక్కుతుందని చెప్పారు.
శనివారం హైదరాబాద్‌లోని డీఎంఆర్‌ఎల్ కార్యలయంలో సంస్థ స్వర్ణోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాని కి ముఖ్యఅతిథిగా హాజరైన అవినాశ్ చందర్ మాట్లాడుతూ.. సాధించిన దాంతో తృప్తి చెందితే ప్రయోజనం లేదని, భవిష్యత్ సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు డీఎంఆర్‌ఎల్ ప్రయత్నించాల్సి ఉంటుందన్నారు. ఉక్కు స్థానంలో మరింత మెరుగైన మిశ్రధాతువుల వినియోగం పెరుగుతోందని, టంగ్‌స్టన్, టైటానియం వంటి లోహాల శుద్ధీకరణకు సంబంధించి ఇప్పటికీ కొన్ని లోటుపాట్లు ఉన్నాయని వివరించారు. వీటన్నింటినీ అధిగమించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు.
రోబో సైన్యంతోపాటు, మానవరహిత యుద్ధాన్ని నడిపేందుకు భారత్ సిద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో డీఎంఆర్‌ఎల్ మరింత నిబద్ధతతో పని చేయాల్సిన అవసరముందని చెప్పారు. డీఎంఆర్‌ఎల్ స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన రజత జ్ఞాపికను అవినాశ్ చందర్ ఆవిష్కరించారు. 50 ఏళ్లలో సంస్థ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సంకలనాన్ని గౌరవ అతిథి, నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ వి.భుజంగరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎంఆర్‌ఎల్ మాజీ డెరైక్టర్లు డాక్టర్ వి.ఎస్.అరుణాచలం, పి.రామారావు, దీపాంకర్ బెనర్జీ, ఎ.ఎం.శ్రీరామమూర్తి, జి.మాలకొండయ్య, డీఎంఆర్‌ఎల్ ప్రస్తుత డెరైక్టర్ అముల్ గోఖలే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ మాజీ డెరైక్టర్లందరినీ సన్మానించారు.
భవిష్యత్ సవాళ్లకు సిద్ధమవ్వాలి: అవినాశ్ చందర్
Published Sun, Oct 27 2013 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement
Advertisement